Kiran Kumar Reddy: కొంచెం తెలివి ఉంటే ఉపయోగించాలి..లేదంటే తెలివి ఉన్నవారిని పక్కన పెట్టుకోవాలి.. రాహుల్ గాంధీపై కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు

Kiran Kumar Reddy Slams Rahul Gandhis Comments on Elections
  • రాహుల్ ఆరోపించినట్లు రిగ్గింగ్ జరిగితే 400కిపైగా స్థానాలు రావాలి కదా అన్న కిరణ్ కుమార్ రెడ్డి
  • ప్రజలు చాలా తెలివైన వారన్న కిరణ్ కుమార్ రెడ్డి
  • రాహుల్ ఆటంబాంబు పేలుడు తుస్సు మందన్న కిరణ్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీని, ఎన్నికల సంఘాన్ని రాహుల్ గాంధీ విమర్శించడంపై కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. రాయచోటిలో నిన్న కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

రోజురోజుకు రాహుల్ గాంధీ విజ్ఞత ఏమవుతోందో అర్థం కావడం లేదని అన్నారు. ఆర్భాటంగా మొదలై తుస్సుమని పోయిందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ రిగ్గింగ్ చేసుకుని, ఎన్నికల సంఘంతో కుమ్మక్కై మూడోసారి అధికారంలోకి వచ్చిందని రాహుల్ అనడాన్ని కిరణ్ కుమార్ రెడ్డి తప్పుబట్టారు. ఈ మాటలు అనడానికి ఆయనకు కొంచెమైనా బుద్ధి ఉండాలని ప్రశ్నించారు.

2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దాదాపు 282 స్థానాలు బీజేపీ గెలుచుకుని 35 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిందన్నారు. 2019 ఎన్నికల్లో ఏకంగా 303 సీట్లు గెలుచుకుని అంతకుముందు కంటే ఎక్కువ మెజార్టీ సాధించిందన్నారు. 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఆరోపించినట్లు రిగ్గింగ్ జరిగితే 400లకు పైగా సీట్లు రావాలి కానీ 240 సీట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు.

2009లో ఏపీలో ఒకేసారి ఎన్నికలు జరిగితే అసెంబ్లీ ఎన్నికల్లో 156 సీట్లు కాంగ్రెస్ గెలిచిందని, 33 పార్లమెంట్ స్థానాలు వచ్చాయని తెలిపారు. పార్లమెంట్‌లో 194 సీట్లు మెజార్టీ వచ్చిందని, ఒకేసారి ఒకే రోజు ఎన్నికలు జరిగితే 38 అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్లమెంట్ కు మెజార్టీ వచ్చిందని, అసెంబ్లీకి తక్కువ మెజార్టీ వచ్చిందని దీన్ని ఏమంటారు..? రిగ్గింగ్ అంటారా..? అని ప్రశ్నించారు. ప్రజలు చాలా తెలివైన వారని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఆయన మాట్లాడే మాటలు నాకే అర్థం కావడం లేదని అన్నారు. కొంచెం తెలివి ఉంటే ఉపయోగించాలి.. లేదంటే తెలివి ఉన్న వారిని పక్కన పెట్టుకోవాలంటూ రాహుల్‌కు కిరణ్ కుమార్ రెడ్డి సలహా ఇచ్చారు. 

Kiran Kumar Reddy
Rahul Gandhi
Congress
BJP
Indian Elections
Election Commission
Andhra Pradesh
Political Criticism
2024 Elections
Rigging Allegations

More Telugu News