Hrithik Roshan: ఇది నేర్పినందుకు నీకు ధన్యవాదాలు తారక్: హృతిక్ రోషన్

Hrithik Roshan Emotional Speech About NTR in War 2 Pre Release Event
  • హైదరాబాద్‌లో ఘనంగా ‘వార్ 2’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్
  • సహనటుడు ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించిన హృతిక్ రోషన్
  • తారక్ నుంచి అంకితభావం నేర్చుకున్నానన్న బాలీవుడ్ గ్రీక్ గాడ్
  • ఎన్టీఆర్ ఒక సింగిల్ టేక్ స్టార్ అని కొనియాడిన హృతిక్
  • సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్
  • ఆగస్టు 14న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘వార్ 2’ విడుదల
బాలీవుడ్ అగ్రహీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, చిత్ర బృందం హైదరాబాద్‌లో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకకు ఇరు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీగా తరలివచ్చి, తమ అభిమాన హీరోల పేర్లతో నినాదాలు చేస్తూ ప్రాంగణాన్ని హోరెత్తించారు.

ఈ కార్యక్రమంలో హృతిక్ రోషన్ మాట్లాడుతూ తన సహనటుడు ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. "తారక్... నేను నిన్ను కేవలం గమనించడమే కాదు, నీ నుంచి ఎంతో నేర్చుకున్నాను," అని ఆయన అన్నారు. ఎన్టీఆర్‌ను సింగిల్ టేక్ స్టార్ అని ఎందుకంటారో తనకు సెట్‌లో అర్థమైందని హృతిక్ తెలిపారు. "ఒక షాట్‌లోకి వెళ్లేటప్పుడు 99.99 శాతం కాదు, వందకు వంద శాతం ఎలా ఇవ్వాలో తారక్ నుంచి నేర్చుకున్నాను. అందుకే అతను షాట్ పూర్తయ్యాక మానిటర్ కూడా చూసుకోడు. ఎందుకంటే తను వంద శాతం ఇచ్చానని అతనికి తెలుసు. ఈ విషయాన్ని నా భవిష్యత్ సినిమాల్లో నేను తప్పకుండా పాటిస్తాను. ఇది నేర్పినందుకు నీకు ధన్యవాదాలు తారక్" అని హృతిక్ భావోద్వేగంగా చెప్పారు.

గత 25 ఏళ్లుగా తమ ఇద్దరి ప్రయాణంలో చాలా పోలికలు ఉన్నాయని, అందుకే ఎన్టీఆర్‌లో తనను, తనలో ఎన్టీఆర్‌ను చూసుకుంటామని హృతిక్ పేర్కొన్నారు. అంతేగాకుండా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి కూడా హృతిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఎన్టీఆర్ మీకందరికీ అన్న అయితే, నాకు తమ్ముడు" అంటే ఎమోషనల్ గా టచ్ చేశారు. 

యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో హృతిక్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ ఈ చిత్రంతోనే బాలీవుడ్‌లోకి ప్రతినాయకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.

సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు, "జనాబే ఆలీ" అనే పాటలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య అదిరిపోయే డ్యాన్స్ వార్ కూడా ఉంటుందని సమాచారం. ప్రీతమ్ స్వరపరిచిన ఈ పాటను సాచెట్ టాండన్, సాజ్ భట్ ఆలపించారు. ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Hrithik Roshan
War 2
Jr NTR
NTR
Ayan Mukerji
Kiara Advani
Bollywood
Tollywood
Yash Raj Films
Spy Universe

More Telugu News