Malla Reddy: జపాన్‌లో లాగే నాకూ రిటైర్మెంట్ ఉండదు: మల్లారెడ్డి

Malla Reddy says no retirement like Japan
  • రాజకీయాల నుంచి వైదొలగుతున్నానన్న వార్తలను ఖండించిన మల్లారెడ్డి
  • తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని, పార్టీ మారేది లేదని వెల్లడి
  • బీజేపీ, టీడీపీలో చేరుతున్నట్టు వస్తున్న ప్రచారంలో నిజం లేదన్న మాజీ మంత్రి
  • దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు విస్తరిస్తానన్న వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని వివరణ
తన రాజకీయ భవిష్యత్తుపై కొనసాగుతున్న ఊహాగానాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ఒక్క ప్రకటనతో తెరదించారు. రాజకీయాల నుంచి తాను తప్పుకోవడం లేదని, చివరి వరకు క్రియాశీల రాజకీయాల్లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. "జపాన్‌లో ప్రజలకు ఏ విధంగా అయితే రిటైర్మెంట్ ఉండదో, నాకు కూడా రాజకీయాల్లో రిటైర్మెంట్ లేదు" అంటూ ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తనకు ఇప్పుడు 73 ఏళ్లని, ఇంక రాజకీయమే వద్దనుకుంటున్నానని మల్లారెడ్డి నిన్న వ్యాఖ్యానించాడం చర్చనీయాంశంగా మారింది. మున్ముందు పూర్తిస్థాయిలో తన విద్యా సంస్థల విస్తరణపై దృష్టి కేంద్రీకరిస్తానని అన్నారు. అయితే ఇవాళ ఆయన తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. 

తాజాగా ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఎప్పుడూ చెప్పలేదని ఆయన తెలిపారు. "నేను నా విద్యాసంస్థలను దేశవ్యాప్తంగా విస్తరిస్తానని చెప్పాను. అంతేకానీ, రాజకీయాలను వదిలేస్తానని అనలేదు. నా మాటలను కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారు" అని ఆయన వివరించారు. తన వ్యాపార ప్రణాళికలను రాజకీయాలకు ముడిపెట్టవద్దని ఆయన సూచించారు.

అదే సమయంలో, పార్టీ మార్పుపై వస్తున్న వదంతులను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. తాను బీజేపీ లేదా టీడీపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చిచెప్పారు. "నేను బీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తే లేదు. ఇదే పార్టీలో కొనసాగుతాను" అని ఆయన పునరుద్ఘాటించారు. ఈ ప్రకటనతో తన రాజకీయ ప్రస్థానంపై నెలకొన్న అన్ని అనుమానాలకు మల్లారెడ్డి ముగింపు పలికినట్లయింది.
Malla Reddy
Malla Reddy retirement
BRS MLA
Telangana politics
Malla Reddy comments
TRS party
BJP TDP
Indian politics
Malla Reddy education institutions
Telangana BRS

More Telugu News