Salman Iftikhar: విమానంలో రేప్ బెదిరింపులు.. జైలుకెళ్లిన భర్తను సమర్థించిన ఇన్‌ఫ్లుయెన్సర్ భార్య!

Salman Iftikhars Wife Defends Him After Rape Threats on Flight
  • బ్రిటిష్ వ్యాపారవేత్త సల్మాన్ ఇఫ్తికార్‌కు 15 నెలల జైలు శిక్ష
  • భర్త చర్యలకు మానసిక సమస్యలే కారణమన్న పాకిస్థానీ ఇన్‌ఫ్లుయెన్సర్ భార్య
  • భర్తకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన అబీర్ రిజ్వీ
  • ఈ ఘటనతో 14 నెలలు ఉద్యోగానికి దూరమయ్యానన్న బాధితురాలు
  • నిందితుడికి యూకేలో మరో భార్య కూడా ఉన్నట్టు వెల్లడి
విమాన సిబ్బందితో అత్యంత దారుణంగా ప్రవర్తించి, అత్యాచారం చేసి చంపుతానని బెదిరించిన కేసులో జైలు పాలైన ఓ బ్రిటిష్ వ్యాపారవేత్తను అతని భార్య వెనకేసుకొచ్చారు. తన భర్త ప్రవర్తనకు మానసిక ఆరోగ్య సమస్యలే కారణమని, అతనిపై సానుభూతి చూపాలని కోరడం చర్చనీయాంశంగా మారింది.

స్టాఫింగ్ మ్యాచ్ అనే రిక్రూట్‌మెంట్ సంస్థ వ్యవస్థాపకుడైన సల్మాన్ ఇఫ్తికార్‌కు ఆగస్టు 5న బ్రిటన్‌లోని ఐల్‌వర్త్ క్రౌన్ కోర్టు 15 నెలల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు వెలువడిన రెండు రోజుల తర్వాత, ఆగస్టు 7న అతని భార్య, పాకిస్థాన్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అబీర్ రిజ్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. "మానసిక ఆరోగ్యం అనేది హాస్యాస్పదమైన విషయం కాదు. ప్రతి కథ వెనుక మీరు చూడని బాధ ఉంటుంది. ఇతరులను నిందించే ముందు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దయతో, మానవత్వంతో ఉండండి" అని ఆమె పేర్కొన్నారు. కాగా, సల్మాన్‌కు యూకేలో మరో భార్య కూడా ఉన్నట్టు మీడియా కథనాలు వెల్లడించాయి.

2023 ఫిబ్రవరి 7న లండన్ నుంచి లాహోర్ వెళ్తున్న వర్జిన్ అట్లాంటిక్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫస్ట్ క్లాస్‌లో తన ముగ్గురు పిల్లలతో ప్రయాణిస్తున్న సల్మాన్ విమానంలో అధికంగా మద్యం సేవించి సిబ్బందితో గొడవకు దిగాడు. ఆంగీ వాల్ష్ అనే మహిళా సిబ్బందిపై జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ, "నిన్ను ఏం చేయాలో నాకు చెప్పొద్దు" అని అరవడం మొదలుపెట్టాడు.

అనంతరం అతను మరింత రెచ్చిపోయి, "నువ్వు చచ్చిపోతావు. నువ్వు ఉండే హోటల్ పేలిపోతుంది. నీ జుట్టు పట్టుకుని గదిలోంచి బయటకు లాగి, సామూహిక అత్యాచారం చేసి నిప్పంటిస్తారు" అంటూ అత్యంత దారుణంగా బెదిరించాడు. విమానం లాహోర్‌లో ల్యాండ్ అయ్యాక అతడిని అరెస్ట్ చేయలేదు. కానీ, 2024 మార్చి 16న ఇంగ్లండ్‌లోని అతని ఇంట్లో బ్రిటిష్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటన వల్ల తాను తీవ్ర మానసిక క్షోభకు గురయ్యానని, 14 నెలల పాటు ఉద్యోగానికి వెళ్లలేకపోయానని బాధితురాలు ఆంగీ వాల్ష్ కోర్టుకు తెలిపారు. తమ సిబ్బంది భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తామని, ఇలాంటి ప్రవర్తనను ఉపేక్షించబోమని వర్జిన్ అట్లాంటిక్ సంస్థ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
Salman Iftikhar
Abeer Rizvi
Virgin Atlantic
flight attendant
rape threats
social media influencer
mental health
İlworth Crown Court
racist remarks

More Telugu News