IndiGo Airlines: విమానంలో సీటు శుభ్రంగా లేదని ఇండిగోకు రూ.1.5 లక్షల జరిమానా

IndiGo Airlines Fined one and half Lakh for Unclean Flight Seat
  • తన సీటు అపరిశుభ్రంగా ఉందంటూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించిన ప్రయాణికుడు
  • ఎయిర్ లైన్స్ తీరుతో మానసిక వేదనకు గురయ్యానని ఫిర్యాదు
  • సేవా లోపం కిందికే వస్తుందంటూ జరిమానా విధించిన ఫోరం
విమానంలో తనకు కేటాయించిన సీటు అపరిశుభ్రంగా ఉందని పింకీ అనే మహిళా ప్రయాణికురాలు ఇండిగో ఎయిర్ లైన్స్ పై వినియోగదారుల హక్కుల ఫోరంను ఆశ్రయించింది. అజర్ బైజాన్ దేశంలోని బాకు సిటీ నుంచి ఢిల్లీకి వస్తుండగా తనకీ పరిస్థితి ఎదురైందని, ఎయిర్ లైన్స్ సిబ్బంది తీరుతో తాను మానసిక వేదనకు గురయ్యానని ఆరోపించింది. ఈ ఫిర్యాదును విచారించిన వినియోగదారుల హక్కుల ఫోరం.. ప్రయాణికులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించలేదని తేల్చింది. ఇది సేవా లోపం కిందకే వస్తుందని స్పష్టం చేసింది.

అయితే, సీటు బాగాలేదని పింకీ ఫిర్యాదు చేయడంతో ఆమెకు వేరే సీటు కేటాయించామని ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. ఆ సీటులో కూర్చుని పింకీ ఢిల్లీకి చేరుకుందని తెలిపింది. ఈ వాదనను వినియోగదారుల ఫోరం పరిగణనలోకి తీసుకోలేదు. టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులకు సరైన సదుపాయాలు కల్పించడం ఎయిర్ లైన్స్ కంపెనీల విధి అని, ఈ విషయంలో ఇండిగో సంస్థ విఫలమైందని తేల్చింది. పింకీ ఎదుర్కొన్న మానసిక వేదనకు, ప్రయాణంలో ఆమెకు కలిగిన అసౌకర్యానికి రూ.1.5 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది. దీంతోపాటు మరో రూ.25 వేలు లీగల్ ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది.
IndiGo Airlines
Pinky
IndiGo penalty
consumer forum
flight seat unclean
Azerbaijan Baku
Delhi flight
consumer rights
service deficiency
airline compensation

More Telugu News