Sanju Samson: సంజూకు గంభీర్ అండ.. 21 సార్లు డకౌట్ అయినా జట్టులో చోటు పక్కా!

Gautam Gambhirs Support for Sanju Samson After 21 Ducks
  • గంభీర్ తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారన్న సంజూ శాంసన్
  • ఓపెనర్‌గా వరుసగా 7 మ్యాచ్‌లలో అవకాశం ఇస్తానని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హామీ  
  • కెప్టెన్, కోచ్‌ల నుంచి లభించిన ఈ భరోసాతో తన ఆత్మవిశ్వాసం పెరిగిందని వ్యాఖ్య
  • గతంలో జట్టులో చోటు కోసం ఎన్నో ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చిందని ఆవేదన
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన కెరీర్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్, కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన ఆటతీరులో మార్పు వచ్చిందని, వారిద్దరూ తనకు అండగా నిలిచారని తెలిపాడు. ఏకంగా 21 సార్లు డకౌట్ అయినా తనను జట్టు నుంచి తొలగించే ప్రసక్తే లేదని గంభీర్ తనతో చెప్పిన మాటలు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని సంజూ వెల్లడించాడు.

టీ20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయని సంజూ శాంసన్ గుర్తుచేసుకున్నాడు. మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ "టీ20 ప్రపంచకప్ తర్వాత గంభీర్ భాయ్ కోచ్‌గా, సూర్య కెప్టెన్‌గా వచ్చారు. ఆ సమయంలో నేను ఆంధ్రలో దులీప్ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్నా. అప్పుడు సూర్య నాతో మాట్లాడి, నీకు మంచి అవకాశం రాబోతోందని, తదుపరి 7 మ్యాచ్‌లలో ఓపెనర్‌గా ఆడిస్తానని మాట ఇచ్చాడు. కెప్టెన్ నుంచి అలాంటి మాటలు వినగానే చాలా సంతోషం అనిపించింది" అని వివరించాడు.

శ్రీలంక పర్యటనలో జరిగిన ఓ సంఘటనను సంజూ పంచుకున్నాడు. "లంక టూర్‌లో రెండు మ్యాచ్‌లలో పరుగులు చేయలేకపోయాను. డ్రెస్సింగ్ రూమ్‌లో నిరాశగా కూర్చున్న నా దగ్గరకు గంభీర్ భాయ్ వచ్చి ఏమైందని అడిగారు. చాలా కాలం తర్వాత అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయానని చెప్పాను. దానికి ఆయన స్పందిస్తూ ‘అయితే ఏంటి? నువ్వు 21 సార్లు డకౌట్ అయితేనే నిన్ను జట్టు నుంచి తీసేస్తాను’ అని అన్నారు. కోచ్, కెప్టెన్ నుంచి అలాంటి భరోసా లభించడం నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. స్వేచ్ఛగా ఆడేందుకు ఆ మాటలు ఎంతగానో ఉపయోగపడ్డాయి" అని శాంసన్ పేర్కొన్నాడు.

2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటికీ, చాలాకాలం జట్టులో చోటు కోసం నిలకడగా వేచి చూడాల్సి రావడం తనను నిరాశకు గురిచేసిందని సంజూ అంగీకరించాడు. "దాదాపు 8-9 ఏళ్ల కెరీర్‌లో నేను ఆడింది కొన్ని మ్యాచ్‌లే. ఇది మానసికంగా చాలా కష్టమైన విషయం. అయినా నేను ఎప్పుడూ సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నించాను. ఒక్కొక్కరి ప్రయాణం ఒక్కోలా ఉంటుంది, నా ప్రయాణం భిన్నమైనదని నాకు నేను చెప్పుకునేవాడిని" అని తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు. ప్రస్తుతం గంభీర్, సూర్యల మద్దతుతో టీ20లలో కీలక ఆటగాడిగా మారిన సంజూ.. సెప్టెంబర్‌లో యూఏఈ వేదికగా జరిగే ఆసియా కప్‌కు ఎంపికయ్యే రేసులో ముందున్నాడు.
Sanju Samson
Sanju Samson cricket
Gautam Gambhir
Suryakumar Yadav
Indian Cricket Team
T20 World Cup
Asia Cup
Duleep Trophy
Sri Lanka tour

More Telugu News