Film Chamber: ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతల మీడియా సమావేశం... వేతనాలపై క్లారిటీ

Tollywood Producers Ready to Hike Wages with Conditions
  • ఫిల్మ్ ఛాంబర్‌లో యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ మీడియా సమావేశం
  • సినీ కార్మికుల వేతనాల పెంపుపై స్పష్టతనిచ్చిన నిర్మాతలు
  • రెండు కేటగిరీలుగా వేతనాలను పెంచేందుకు సుముఖత
  • తాము పెట్టిన షరతులకు ఫెడరేషన్ అంగీకరించాలని స్పష్టీకరణ
  • సమావేశానికి హాజరైన పలువురు ప్రముఖ నిర్మాతలు
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు అంశంపై గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు నిర్మాతలు తెరదించారు. వేతనాలను పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే కొన్ని షరతులు వర్తిస్తాయని స్పష్టం చేశారు. శనివారం ఫిల్మ్ ఛాంబర్‌లో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ మీడియా సమావేశం నిర్వహించి, తమ ప్రతిపాదనలను వెల్లడించారు.

ఈ సమావేశంలో నిర్మాతలు రెండు రకాల వేతన పెంపు విధానాలను ప్రకటించారు. రోజుకు రూ. 2000 లేదా అంతకంటే తక్కువ వేతనం తీసుకునే కార్మికులకు మొదటి ఏడాది 15 శాతం, రెండవ ఏడాది 5 శాతం, మూడవ ఏడాది మరో 5 శాతం చొప్పున వేతనం పెంచడానికి సుముఖత వ్యక్తం చేశారు. అదేవిధంగా, రోజుకు రూ. 1000 లేదా అంతకన్నా తక్కువ వేతనం పొందుతున్న కార్మికులకు మొదటి ఏడాది 20 శాతం, మూడవ ఏడాది 5 శాతం పెంచనున్నట్లు తెలిపారు. అయితే, వీరికి రెండవ ఏడాది వేతన పెంపు ఉండదని స్పష్టం చేశారు.

ఈ వేతన పెంపు వెంటనే అమల్లోకి రాదని, దీనికి ఒక ముఖ్యమైన షరతు విధించినట్లు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ తెలిపారు. నిర్మాతలు ఇప్పటికే ఫెడరేషన్ ముందు ఉంచిన కొన్ని నిబంధనలకు వారు అంగీకారం తెలిపితేనే ఈ కొత్త వేతనాలు అమలవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో బంతి ఫెడరేషన్ కోర్టులోకి వెళ్లినట్లయింది.

ఈ మీడియా సమావేశంలో ప్రముఖ నిర్మాతలు విశ్వప్రసాద్, నాగవంశీ, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్, సుధాకర్ చెరుకూరి, రాధామోహన్, సాహు గారపాటి, ఎస్.కె.ఎన్, బాపినీడు, చెర్రీ తదితరులు పాల్గొన్నారు.
Film Chamber
Telugu film industry
Tollywood
Film workers wages
Film Producers meeting
Damodar Prasad
Vishnu Prasad
Wage hike
Movie workers

More Telugu News