Robert Vadra: గురుగ్రామ్‌ ల్యాండ్ డీల్ లో వాద్రాకు రూ.58 కోట్ల లబ్ది చేకూరింది: ఈడీ

Robert Vadra Benefited Rs 58 Crore in Gurugram Land Deal ED
  • రాబర్ట్ వాద్రాపై మనీలాండరింగ్ కేసులో ఈడీ ఛార్జ్‌షీట్
  • ఆగస్టు 28న విచారణకు స్వీకరించనున్న ఢిల్లీ ప్రత్యేక కోర్టు
  • రూ. 38.69 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
  • అప్పటి సీఎంపై ఒత్తిడి తెచ్చి లబ్ధి పొందినట్లు ఈడీ ఆరోపణ
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు మనీలాండరింగ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది. గురుగ్రామ్‌లో జరిగిన ఓ వివాదాస్పద భూ ఒప్పందం ద్వారా వాద్రాకు రూ. 58 కోట్ల మేర లబ్ధి చేకూరినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. ఈ మేరకు ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈడీ ఫిర్యాదును పరిశీలించిన కోర్టు, దీనిపై విచారణను ఆగస్టు 28వ తేదీకి వాయిదా వేస్తూ వాద్రాకు నోటీసులు జారీ చేసింది.

ఈడీ తన ఛార్జ్‌షీట్‌లో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. గురుగ్రామ్‌లోని షికోహ్‌పూర్‌లో ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వాద్రాకు చెందిన స్కై లైట్ హాస్పిటాలిటీ అనే సంస్థ 3.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. కేవలం రూ. 7.50 కోట్లకు ఈ భూమిని కొన్నట్లు సేల్ డీడ్‌లో చూపించారు. అయితే, ఈ భూమి అసలు విలువ రూ. 15 కోట్లు అని ఈడీ పేర్కొంది. చెక్కు ద్వారా చెల్లింపులు జరిపినట్లు పత్రాల్లో చూపినా, ఆ చెక్కు ఎన్నడూ ఎన్‌క్యాష్ కాలేదని ఈడీ తన దర్యాప్తులో తేల్చింది.

భూమి విలువను తక్కువ చేసి చూపడం ద్వారా రూ. 45 లక్షల స్టాంప్ డ్యూటీని ఎగవేసినట్లు ఈడీ ఆరోపించింది. ఇది ఐపీసీ సెక్షన్ 423 కింద నేరమని స్పష్టం చేసింది. ఈ మొత్తం లావాదేవీని ఒక లంచంగా ఈడీ అభివర్ణించింది. ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్‌కు హౌసింగ్ స్కీమ్ లైసెన్స్ ఇప్పించేందుకు అప్పటి హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాపై వాద్రా తన పలుకుబడిని ఉపయోగించారని, దానికి ప్రతిఫలంగానే ఎలాంటి చెల్లింపులు లేకుండా ఆ భూమిని వాద్రా సంస్థకు బదిలీ చేశారని ఈడీ ఆరోపించింది.

ఈ కుంభకోణం ద్వారా వచ్చిన రూ. 58 కోట్లను రెండు కంపెనీల ద్వారా మళ్లించినట్లు ఈడీ తెలిపింది. స్కై లైట్ హాస్పిటాలిటీ ద్వారా రూ. 53 కోట్లు, బ్లూ బ్రీజ్ ట్రేడింగ్ ద్వారా మరో రూ. 5 కోట్లు బదిలీ అయ్యాయని పేర్కొంది. ఈ డబ్బుతో వాద్రా ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేశారని, పెట్టుబడులు పెట్టారని, తన గ్రూప్ కంపెనీల రుణాలను తీర్చడానికి ఉపయోగించారని ఛార్జ్‌షీట్‌లో వివరించింది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా రూ. 38.69 కోట్ల విలువైన 43 స్థిరాస్తులను ఇప్పటికే అటాచ్ చేసినట్లు ఈడీ కోర్టుకు తెలియజేసింది. ఈ ఆస్తులలో రాజస్థాన్‌లోని బికనీర్, గురుగ్రామ్, మొహాలీ, అహ్మదాబాద్, ఫరీదాబాద్, నోయిడాలలో ఉన్న భూములు, వాణిజ్య సముదాయాలు, ఫ్లాట్లు ఉన్నాయి. ఈ కేసులో నిందితులకు పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్ 4 కింద గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించాలని, ఆస్తులను జప్తు చేయాలని ఈడీ కోరింది.
Robert Vadra
Vadra land deal
Gurugram land scam
Priyanka Gandhi
Enforcement Directorate
Money laundering case
Bhupinder Singh Hooda
Haryana land
Skylight Hospitality
Omkareshwar Properties

More Telugu News