Deepak: పండగ పూట పసివాడి ప్రాణం తీసిన వేరుసెనగ గింజ.. పెనుకొండలో విషాదం

Toddler Dies After Choking on Peanut in Penukonda Anantapur
––
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సందడి నెలకొన్న ఇంట్లో కాసేపటికే విషాదం చోటుచేసుకుంది. పిండివంటల తయారీ కోసం సిద్ధం చేసిన వేరుసెనగ గింజలు తింటూ రెండేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. గింజ గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరి ఆడక విలవిల్లాడాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. అనంతపురం జిల్లా పెనుకొండలో ఈ విషాదం చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే.. పెనుకొండ పంచాయతీ పరిధిలోని వెంకటరెడ్డిపల్లికి చెందిన నాగరాజు, జ్యోతి దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు దీపక్ వయసు రెండేళ్లు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా  జ్యోతి వంటింట్లో పిండి వంటలు తయారుచేస్తోంది. ఇంతలో అక్కడికి వచ్చిన దీపక్ వేరుసెనగ గింజలను గుప్పిట పట్టుకుని నోట్లో వేసుకున్నాడు. అయితే, ఓ గింజ గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరి అందక విలవిల్లాడాడు. 

కుటుంబ సభ్యులు బాలుడిని హుటాహుటిన పెనుకొండ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాబును పరీక్షించిన వైద్యులు.. ఊపిరి ఆడక బాలుడు అప్పటికే మరణించాడని నిర్ధారించారు. దీంతో నాగరాజు– జ్యోతి కన్నీరుమున్నీరయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బాబు పండగపూట దూరం కావడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది.
Deepak
Anantapur district
Penukonda
peanut
Varalakshmi Vratham
child death
Andhra Pradesh news
accident
choking hazard
toddler death

More Telugu News