Marriage: మతం దాచి పెళ్లి చేసుకుంటే పదేళ్ల జైలు.. రూ. 3 లక్షల వరకు జరిమానా

Haryana Government to Punish Religious Conversion Marriages
  • మతం దాచి పెళ్లి చేసుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని హర్యానా సర్కార్ ఆదేశం
  • మోసపూరిత వివాహాలను చట్ట ప్రకారం రద్దు చేయనున్న అధికారులు
  • మైనర్లు, మహిళలు, ఎస్సీ/ఎస్టీల మత మార్పిడిపై మరింత కఠిన శిక్షలు
  • చట్టబద్ధంగా మతం మారేందుకు స్పష్టమైన విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం
మతాన్ని దాచిపెట్టి మోసపూరితంగా వివాహం చేసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 2022లో తీసుకొచ్చిన "మత మార్పిడి నిరోధక చట్టం" నిబంధనలను పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులకు తాజాగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పెళ్లి పేరుతో జరిగే మోసపూరిత మత మార్పిడులకు అడ్డుకట్ట వేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

ఈ చట్టం ప్రకారం, ఎవరైనా తమ మతాన్ని దాచిపెట్టి వివాహం చేసుకున్నట్లు రుజువైతే, ఆ పెళ్లిని రద్దు చేస్తారు. అంతేకాకుండా, బాధ్యులైన వ్యక్తిపై చట్టపరంగా విచారణ జరిపి కఠిన శిక్ష విధిస్తారు. వివాహం కోసం మతం మారడం లేదా మార్పించడం కూడా ఈ చట్టం కింద నేరంగా పరిగణిస్తారు. బలవంతం, మోసం, ఒత్తిడి, ప్రలోభం లేదా డిజిటల్ మాధ్యమాల ద్వారా మత మార్పిడికి ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే, ఈ చట్టం యొక్క ఉద్దేశ్యం ప్రజల మత స్వేచ్ఛకు భంగం కలిగించడం కాదని, కేవలం మోసపూరిత, బలవంతపు మార్పిడుల నుంచి పౌరులను రక్షించడమేనని హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుమితా మిశ్రా స్పష్టం చేశారు.

చట్టంలోని శిక్షల వివరాలు..
మోసపూరితంగా పెళ్లి చేసుకుంటే: మతాన్ని దాచిపెట్టి వివాహం చేసుకున్న వారికి 3 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, కనీసం రూ. 3 లక్షల జరిమానా విధిస్తారు. ఆ వివాహాన్ని రద్దు చేస్తారు.
మైనర్లు, మహిళలు, ఎస్సీ/ఎస్టీల మత మార్పిడి: వీరిని బలవంతంగా మతం మార్పిస్తే 4 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, కనీసం రూ. 3 లక్షల జరిమానా ఉంటుంది.
సామూహిక మత మార్పిడి: ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని ఒకేసారి మతం మార్పిస్తే 5 నుంచి 10 ఏళ్ల జైలు, రూ. 4 లక్షల జరిమానా విధిస్తారు.
సాధారణ అక్రమ మత మార్పిడి: ఇతర మోసపూరిత మార్పిడులకు పాల్పడితే 1 నుంచి 5 ఏళ్ల జైలు, రూ. లక్ష జరిమానా ఉంటుంది.

చట్టబద్ధమైన ప్రక్రియ ఇది..
చట్ట ప్రకారం మతం మారాలనుకునే వారు ముందుగా డిప్యూటీ కమిషనర్‌కు 'ఫారం-ఏ'లో డిక్లరేషన్ ఇవ్వాలి. మైనర్ల విషయంలో వారి తల్లిదండ్రులు 'ఫారం-బీ' సమర్పించాలి. మత మార్పిడి కార్యక్రమం నిర్వహించే మత గురువులు కూడా 'ఫారం-సీ' ద్వారా ముందస్తు సమాచారం ఇవ్వాలి. ఈ నోటీసులపై ఎవరికైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా ఫిర్యాదు చేయవచ్చు. అప్పుడు అధికారులు విచారణ జరిపి, మోసం జరిగిందని తేలితే మత మార్పిడికి అనుమతి నిరాకరిస్తారు.

ఈ చట్టం కింద రద్దయిన వివాహం ద్వారా పుట్టిన పిల్లలకు చట్టబద్ధత ఉంటుందని, తల్లిదండ్రుల ఆస్తిపై వారసత్వ హక్కులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Marriage
Haryana Government
Religious conversion law
Love Jihad law
Anti conversion law Haryana
Religious freedom
Sumita Mishra
Haryana news
Illegal conversion
Forced conversion

More Telugu News