Chandrababu Naidu: మొక్కు చెల్లించుకున్న అభిమానిని కలిసిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Meets Fan Varalakshmi Who Fulfilled Vow
  • చంద్రబాబు సీఎం అయితే 108 దేవాలయాల్లో సంకీర్తనా గానం 
  • మొక్కుకున్న గాయని వరలక్ష్మి
  • మొక్కు తీర్చుకుని ముఖ్యమంత్రిని కలిసిన వైనం
  • ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు 
  • మంగళగిరిలో పుట్టి ముంబైలో స్థిరపడిన గాయని
ఏపీకి చంద్రబాబు సీఎం అయితే 108 దేవాలయాల్లో సంకీర్తనా గానం చేస్తానని మొక్కుకున్న గాయని వరలక్ష్మి శుక్రవారం ముఖ్యమంత్రిని కలిశారు. రాష్ట్రం విడిపోయాక ఏపీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం అవ్వాలనేదే తన బలమైన నమ్మకమని తెలిపారు.  అందుకే చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటూ 108 దేవాలయాల్లో సంగీత కచేరీలు చేస్తానని మొక్కుకున్నట్టు సీఎంకు వివరించారు. మంగళగిరిలో పుట్టిన తాను ముంబైలో స్థిరపడ్డానని... కానీ జన్మభూమిపై మమకారాన్ని వదులుకోలేదని వరలక్ష్మి చెప్పారు. 

సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొక్కు చెల్లించుకునేందుకు అన్నవరం దేవస్థానంలో తొలి కచేరీ నిర్వహించానని.. ఏపీతో పాటు మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తాను సంగీత కచేరీ నిర్వహించానని సీఎంకు చెప్పారు. చివరి కచేరీ దుర్గమ్మ సన్నిధిలో నిర్వహించానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా తాను నిర్వహించిన కచేరీల వివరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 

కచేరీలకు సంబంధించి వరలక్ష్మి రాసుకున్న పుస్తకాన్ని చంద్రబాబు పరిశీలించి సంతకం చేశారు. తన పట్ల వరలక్ష్మి చూపిన అభిమానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని కోరుకున్న వరలక్ష్మి లాంటి వాళ్లు తనకు అండగా నిలవడం, రాష్ట్రం కోసం, తన కోసం దేవుళ్లను ప్రార్ధించడం వల్లే ప్రజల అభిమానానికి, కార్యకర్తల కష్టానికి దైవ కృప తోడైందని చంద్రబాబు అన్నారు. వరలక్ష్మి లాంటి అభిమానులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. వరలక్ష్మితో పాటు ఆమె సోదరుడు శ్రీ భాష్యం రంగనాథ్ కూడా సీఎం చంద్రబాబును కలిశారు.
Chandrababu Naidu
AP CM
Andhra Pradesh CM
Varalakshmi Singer
108 Temples
Sankeertana
Musical Concert
AP Development
Telugu News
Andhra Pradesh News

More Telugu News