Bandi Sanjay: కేసీఆర్ ఆఖరికి కూతురు, అల్లుడు ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు: బండి సంజయ్

Bandi Sanjay Alleges KCR Tapped Daughter and Son in Law Phones
  • ట్యాపింగ్ ద్వారా వేల కోట్లు దోచుకున్నారంటూ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు
  • కేసీఆర్‌తో సీఎం రేవంత్ రెడ్డికి లోపాయికారీ ఒప్పందం ఉందని విమర్శ
  • సిట్ విచారణపై అనుమానాలు, కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా వాంగ్మూలం నమోదు చేసిన బండి సంజయ్
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తన సొంత కూతురు కవిత, అల్లుడు అనిల్ కుమార్‌తో పాటు మేనల్లుడు, అప్పటి మంత్రి టీ. హరీశ్ రావు ఫోన్లను కూడా ట్యాప్ చేయించారని అన్నారు. శుక్రవారం నాడు ఈ కేసుకు సంబంధించి సిట్ ఎదుట సాక్షిగా హాజరైన ఆయన, విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ పాలనలో మావోయిస్టుల పేరు చెప్పి రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. కేవలం తన ఫోన్లే కాకుండా తన కుటుంబ సభ్యులు, పీఏ, చివరికి డ్రైవర్ ఫోన్లను కూడా ట్యాప్ చేశారని అన్నారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు, సినీ నటుల ఫోన్లు కూడా ట్యాపింగ్ జాబితాలో ఉన్నాయని, ఆ జాబితా చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపారు. పేపర్ లీకేజీ కేసును విచారిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి ఫోన్‌ను సైతం ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు.

ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజకీయ నాయకులను బెదిరించి వందల కోట్లు స్వాధీనం చేసుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అలా దొరికిన డబ్బును కేసీఆర్, కేటీఆర్, అప్పటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, మరో పోలీసు అధికారి రాధాకిషన్ రావు పంచుకున్నారని అన్నారు. "రూ. 20 కోట్లు పట్టుకుంటే, రికార్డుల్లో కేవలం రూ. 2 కోట్లు మాత్రమే చూపించేవారు" అని ఆయన వివరించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి నుంచి రూ. 7 కోట్లు పట్టుకున్నారని, ఆ డబ్బు ఏమైందో ఇప్పటికీ తెలియదని అన్నారు.

ఈ కేసు దర్యాప్తు విషయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కేసీఆర్‌కు మధ్య రహస్య ఒప్పందం ఉందని, అందుకే ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారని ఆరోపించారు. వేల కోట్ల దోపిడీపై ఆధారాలున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. సిట్‌కు ఈ కేసును దర్యాప్తు చేసే అధికారాలు లేవని, నిజాలు బయటకు రావాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంపై విచారణ జరపాలని కోరుతూ ఈడీకి లేఖ రాయాలని ప్రభుత్వాన్ని కోరారు. కేసుకు సంబంధించిన కొన్ని ఆధారాలు, సమాచారాన్ని సీల్డ్ కవర్‌లో సిట్‌కు అందజేసినట్లు ఆయన తెలిపారు.
Bandi Sanjay
KCR
Kavitha
Telangana phone tapping case
Revanth Reddy
BRS phone tapping
Telangana politics
Phone tapping scam
Cyberabad SIB
Telangana government

More Telugu News