Nicolas Maduro: వెనెజువెలా అధ్యక్షుడిపై అమెరికా రూ.430 కోట్ల రివార్డు

US offers 50 million us dollors reward for Nicolas Maduro arrest
  • మదురో అరెస్టుకు సహకరిస్తే 50 మిలియన్ డాలర్ల బహుమానం
  • అమెరికాలో డ్రగ్స్‌ వ్యాప్తికి ప్రయత్నిస్తున్నారని మదురోపై ఆరోపణ
  • మదురో, ఆయన సన్నిహితులకు సంబంధించిన 30 టన్నుల కొకైన్‌ సీజ్ చేశామన్న అమెరికా
  • ప్రైవేట్‌ జెట్‌లు సహా 700 మిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తుల స్వాధీనం
అమెరికాలో డ్రగ్స్ వ్యాప్తిని, హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురోపై అగ్రరాజ్యం మండిపడుతోంది. ఈ ఆరోపణలతో మదురోను అరెస్టు చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే మదురో అరెస్టుకు సహకరిస్తే ఏకంగా 50 మిలియన్ డాలర్లు (రూపాయల్లో దాదాపు 430 కోట్లు) ముట్టజెబుతామంటూ సంచలన ప్రకటన చేసింది. డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో ఈ నజరానా 15 మిలియన్ డాలర్లు ఉండగా.. జో బైడెన్ ప్రెసిడెంట్ అయ్యాక ఈ రివార్డును 25 మిలియన్ డాలర్లకు పెంచారు. తాజాగా ఈ మొత్తాన్ని 50 మిలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు అమెరికా అటార్నీ జనరల్‌ పామ్‌ బాండీ ఎక్స్‌లో ఓ వీడియో పోస్టు చేశారు.

‘అమెరికాలో డ్రగ్స్‌ వ్యాప్తికి, హింసను ప్రేరేపించేందుకు నికోలస్‌ మదురో ట్రెన్‌ డె అరాగువా, సినలో, కార్టల్‌ ఆఫ్‌ ది సన్స్‌ వంటి వాటిని వినియోగిస్తున్నారు’’ అని పామ్ బాండీ ఆరోపించారు. ఇప్పటివరకు నికోలస్‌ మదురోకు సంబంధించిన 7 టన్నుల కొకైన్ తో పాటు ఆయన సన్నిహితులకు సంబంధించిన 23 టన్నుల కొకైన్‌ను డ్రగ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ సీజ్‌ చేసిందని బాండీ వెల్లడించారు. వెనెజువెలా, మెక్సికోలలోని డ్రగ్‌ మాఫియాకు ఇదే ప్రధాన ఆదాయ వనరుగా మారిందన్నారు. 

ఫెంటెనిల్‌ స్మగ్లింగ్‌తో కూడా మదురోకు సంబంధాలున్నాయని బాండీ పేర్కొన్నారు. ఇప్పటికే 2020 మార్చిలో ఆయనపై దక్షిణ న్యూయార్క్‌ డిస్ట్రిక్ట్‌లో కేసులు నమోదైనట్లు చెప్పారు. కాగా, మదురోకు సంబంధించిన ప్రైవేట్ జెట్ లు, తొమ్మిది వాహనాలు సహా 700 మిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులను అమెరికాలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ సీజ్‌ చేసింది.

Nicolas Maduro
Venezuela
US reward
drug trafficking
Pam Bondi
cocaine
Fentanyl smuggling
Department of Justice

More Telugu News