YS Sunitha: న్యాయం కోసం ఇంకెన్నాళ్లు పోరాడాలి..?: సునీత ఆవేదన.. వీడియో ఇదిగో!

YS Sunitha Asks How Long Must She Fight for Justice in Viveka Case
  • శిక్ష నాకా లేక నిందితులకా అనేది అర్థం కావడంలేదన్న సునీత
  • సీబీఐ విచారణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని వెల్లడి
  • హింసలేని పులివెందుల కోసం పోరాడుతున్నానని ఉద్ఘాటన
తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులతో పాటు తాను కూడా ప్రతి వాయిదాకు కోర్టుకు హాజరవుతున్నానని, అసలు శిక్ష నిందితులకా లేక తనకా అన్నది అర్థం కావడం లేదని ఆయన కుమార్తె డాక్టర్ సునీత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి 74వ జయంతి సందర్భంగా పులివెందులలోని ఆయన ఘాట్ వద్ద సునీత, ఆమె భర్త నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, కేసు విచారణలో జరుగుతున్న జాప్యంపై, గత ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

నిందితులంతా బయట స్వేచ్ఛగా తిరుగుతుంటే, న్యాయం కోసం తాను సుప్రీంకోర్టు నుంచి సీబీఐ కోర్టు వరకు తిరగాల్సి వస్తోందని సునీత వాపోయారు. "దాదాపు ఆరేళ్లు కావొస్తోంది. ఇంకా ఎంతకాలం ఈ పోరాటం చేయాలో తెలియడం లేదు. ప్రతి వాయిదాకు నిందితులతో పాటు నేను కూడా కోర్టుకు వెళ్తున్నాను. శిక్ష ఎవరికి పడుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది," అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసు విచారణను పూర్తిగా నీరుగార్చిందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. "నాన్న హత్య జరిగిన రోజు ఘటనా స్థలంలో సాక్ష్యాలను చెరిపేశారు. రక్తాన్ని శుభ్రం చేయించారు. అప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? వారిని బెదిరించారా లేక వారు తొత్తులుగా పనిచేశారా? వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అనుమానితులందరినీ విడిచిపెట్టారు. దర్యాప్తు అధికారులను మార్చేశారు. అనుమానం అవినాష్ రెడ్డి వైపు వెళ్తున్నప్పుడు, విచారణను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు," అని సునీత ఆరోపించారు.

"గత ఐదేళ్లు అధికారంలో ఉండి, సాక్షులను బెదిరించి, కేసును నీరుగార్చిన వాళ్లు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని అడగడం హాస్యాస్పదంగా ఉంది," అని ఆమె అన్నారు. ఈ కేసులో న్యాయం వేగంగా జరిగేలా మీడియా, ప్రజలు తమ వంతుగా ఒత్తిడి తీసుకురావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. చిన్నప్పుడు తమతో కలిసి ఆడుకున్న అవినాష్ రెడ్డి ఇలాంటి నేరానికి పాల్పడతాడని తాను కలలో కూడా ఊహించలేదని సునీత ఆవేదనతో పేర్కొన్నారు.

సీబీఐ విచారణ అసంపూర్తిగా ఉందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. అప్పుడు పోలీసులను బెదిరించి సాక్ష్యాధారాలన్నీ తుడిపేశారు. ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మళ్లీ బెదిరించాలని చూస్తున్నారు. హింస లేని కొత్త పులివెందులను ప్రజలు చూడాలనుకుంటున్నారు. అందుకోసమే నేను పోరాడుతున్నాను" అని సునీత పేర్కొన్నారు.
YS Sunitha
YS Vivekananda Reddy
Viveka murder case
Andhra Pradesh politics
Pulivendula
CBI investigation
Justice for Viveka
Political crime
YS family
Supreme Court petition

More Telugu News