The Paradise: నరకాన్ని స్వర్గంగా మార్చే 'జడల్'.. నాని 'ది ప్యారడైజ్' ఫస్ట్ లుక్ వచ్చేసింది!

Nanis look as Jadel from The Paradise out
  • 'జడల్' అనే పవర్‌ఫుల్ పాత్రలో నేచురల్ స్టార్
  • నరకాన్ని స్వర్గంగా మార్చేస్తాడన్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల
  • 'దసరా' బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెలల కాంబో
  • 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో విడుదల
  • ప్రతినాయకుడిగా 'కిల్' ఫేమ్ రాఘవ్ జుయల్
'దసరా' వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రం 'ది ప్యారడైజ్'. ఈ యాక్షన్ థ్రిల్లర్ నుంచి ఈ రోజు నాని ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో నాని 'జడల్' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుండగా, ఆయన లుక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియాలో పోస్టర్‌ను పంచుకుంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "మీ అందరి ముందుకి 'జడల్'ను తీసుకొస్తున్నా. ఈసారి మా హీరో నాని అన్న నరకంలోకి నడిచివెళ్లి దాన్ని 'ది ప్యారడైజ్'గా మార్చేస్తాడు" అని పేర్కొన్నారు. నాని కూడా తన లుక్‌ను షేర్ చేస్తూ, "వాడి పేరు 'జడల్'. ఉన్నది ఉన్నట్లు చెబుతున్నా" అని రాసుకొచ్చారు.

నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ సహా మొత్తం 8 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో 'కిల్' సినిమాతో గుర్తింపు పొందిన నటుడు రాఘవ్ జుయల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు.

ప్రస్తుతం 'ది ప్యారడైజ్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్ప‌టికే, ఫైట్ మాస్టర్ రియల్ సతీశ్ పర్యవేక్షణలో భారీ సెట్‌లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం విదేశీ స్టంట్ మాస్టర్లు కూడా పనిచేశారని, ఇది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఇకపై సినిమాలోని ప్రతి పాత్రను రెండు పోస్టర్ల ద్వారా పరిచయం చేస్తామని దర్శకుడు ఓదెల వినూత్న ప్రచార వ్యూహాన్ని వెల్లడించారు. ఎస్ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

The Paradise
Nani
Srikanth Odela
The Paradise movie
Jadal Nani
Raghav Juyal
Telugu movie 2026
Action thriller
Sudhakar Cherukuri
SLV Cinemas

More Telugu News