Virat Kohli: విరుష్క జంటకు 'పాము' వడ్డించిన చెఫ్... రెండో పెళ్లిరోజు నాటి ఆసక్తికర కథనం!

Virat Kohli Anushka Sharma Were Served Cuisine With Lot Of Snake On Anniversary
  • సెలబ్రిటీ చెఫ్ హర్ష్ దీక్షిత్ వెల్లడించిన వంటక రహస్యం
  • వియత్నాం వంటకం 'ఫో'కు వీగన్ టచ్
  • శాకాహారుల కోసం పొట్లకాయతో 'పాము' వంటకం
  • టోఫు, కొబ్బరి, పల్లీలతో ప్రత్యేక స్టఫింగ్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల జంటకు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో కోహ్లీ ఆడుతున్నప్పుడు స్టాండ్స్‌లో అనుష్క సందడి చేయడం అభిమానులకు కనుల పండుగే. ఏడేళ్లు గడిచినా వారిద్దరి బంధం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అయితే, 2019లో వారి రెండో పెళ్లిరోజు సందర్భంగా జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ హర్ష్ దీక్షిత్ తాజాగా వెల్లడించారు.

కోహ్లీ పూర్తి శాకాహారి (వీగన్) అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి రెండో వివాహ వార్షికోత్సవానికి ఏదైనా ప్రత్యేకంగా చేయాలని భావించిన చెఫ్ హర్ష్, వియత్నాంకు చెందిన ప్రసిద్ధ వంటకం 'ఫో'ను ఎంచుకున్నారు. వాస్తవానికి ఈ 'ఫో' సూప్‌లో చికెన్, బీఫ్ వంటి మాంసాహారాన్ని ఎక్కువగా వాడతారు. కానీ, విరుష్క జంట కోసం దీనిని పూర్తిగా శాకాహారంలోకి మార్చి, సరికొత్తగా వడ్డించారు.

ఆ సమయంలో కోహ్లీ, అనుష్క గ్లూటెన్-ఫ్రీ డైట్ కూడా పాటిస్తుండటంతో, 'ఫో'లో సంప్రదాయంగా వాడే రైస్ నూడుల్స్‌నే ఉపయోగించారు. అసలు ప్రయోగం ఇక్కడే మొదలైంది. "వియత్నాం వంటకాల్లో పాము మాంసం కూడా వాడతారు. మరి శాకాహారులకు 'పాము'ను వడ్డిస్తే ఎలా ఉంటుంది?" అనే సరదా ఆలోచనతో చెఫ్ హర్ష్ ఒక ప్రయోగం చేశారు.

అందుకోసం పొట్లకాయను ఎంచుకున్నారు. పొట్లకాయలో పల్లీలు, కొబ్బరి, టోఫు, కొద్దిగా కొత్తిమీర మిశ్రమాన్ని నింపి, దానికి స్మోక్డ్ ఫ్లేవర్ ఇచ్చారు. దీనికి తోడు నిమ్మగడ్డి, అల్లం, కొత్తిమీర వేర్లతో తయారుచేసిన సూప్‌లో వాటర్ చెస్ట్‌నట్, ఎనోకి మష్రూమ్స్, మిరపకాయలు జోడించి వడ్డించారు. "వారి డైట్ పరిమితులకు లోబడే సరదాగా ఏదైనా చేయాలన్నది నా ఆలోచన. ఒక ప్రైవేట్ చెఫ్ అంటే అదే కదా" అని హర్ష్ దీక్షిత్ ఆనాటి అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సంఘటన విరుష్క జంట తమ ప్రత్యేక సందర్భాలను ఎంత వినూత్నంగా జరుపుకుంటారో తెలియజేస్తోంది. కాగా, ఈ సెలబ్రిటీ జంట 2017 డిసెంబర్ 11న వివాహబంధంలోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. 
Virat Kohli
Anushka Sharma
Virushka
Chef Harsh Dixit
Vegan Food
Wedding Anniversary
Pho Soup
Vietnamese Cuisine
Gluten Free Diet

More Telugu News