Chandrababu Naidu: సంపాదనతో దొరకని సంతృప్తి సాయం చేస్తేనే లభిస్తుంది: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Says Helping Others Gives Satisfaction
  • విజయవాడలో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం
  • పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వ్యాపారవేత్తలకు పిలుపు
  • సంపాదనతో కలగని సంతృప్తి సాయం చేస్తే వస్తుందని ఉద్ఘాటన
  • ప్రభుత్వ సంక్షేమానికి తోడుగా దత్తత కుటుంబాల్లో నైపుణ్యాలు పెంచాలని సూచన
  • సీఎం పిలుపుతో కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు
  • సాయం చేసేందుకు ఆసక్తి ఉన్న వారి కోసం కో-స్పాన్సర్ విధానం ప్రకటన
సంపాదనతో లభించని అసలైన సంతృప్తి, సమాజానికి సాయం చేసినప్పుడే కలుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని అడిగానని, ఇప్పుడు పెట్టుబడులతో పాటు పేదలకు అండగా నిలవాలని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో గురువారం ‘పీపుల్స్ పార్ట్‌నర్‌షిప్ ఫర్ పావర్టీ ఎరాడికేషన్’ (పీ4) కార్యక్రమంపై పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శకులుగా మారి పేద కుటుంబాల అభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సంస్కరణలు చూశాను. కానీ పీ4 కార్యక్రమం ఇస్తున్న తృప్తి మరేదీ ఇవ్వడం లేదు. ఆర్థిక సంస్కరణల ఫలాలను కొందరు అందుకుని ఉన్నత స్థాయికి చేరారు, మరికొందరు వెనుకబడిపోయారు. ఇప్పుడు ఆ అసమానతలను తొలగించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఉన్నత స్థితిలో ఉన్నవారు చేసే చిన్న సాయం కూడా, పేదరికంలో ఉన్నవారికి అతిపెద్ద భరోసా ఇస్తుంది," అని వివరించారు.

ప్రభుత్వానిది సంక్షేమం, మీది బాధ్యతాయుత సాయం
మాటలతో కాకుండా చేతల్లో చేసి చూపించాలనే ఉద్దేశంతో తాను స్వయంగా 250 కుటుంబాలను దత్తత తీసుకున్నానని చంద్రబాబు తెలిపారు. "ప్రభుత్వం తరఫున పింఛన్లు, తల్లికి వందనం, దీపం పథకం, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ప్రభుత్వ సాయానికి తోడుగా మీరు కూడా బాధ్యత తీసుకుని దత్తత కుటుంబాల్లో నైపుణ్యాలను పెంచడం ద్వారా వారి ఆదాయం రెట్టింపు అయ్యేలా చూడాలి," అని ఆయన కోరారు.

సీఎం పిలుపుకు భారీ స్పందన
చంద్రబాబు పిలుపునకు సమావేశంలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలు, ఎన్నారైల నుంచి విశేష స్పందన లభించింది. ప్రకాశం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త మోహన్ రెడ్డి ఒకేసారి 729 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. పలువురు ఎన్నారైలు, స్థానిక వ్యాపారవేత్తలు వందలాది కుటుంబాలను, పాఠశాలలను దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్థికంగా సాయం చేయలేని వారు తమ విజ్ఞానాన్ని, నైపుణ్యాలను పంచేందుకు వీలుగా ‘కో-స్పాన్సర్’ విధానాన్ని కూడా తీసుకువస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, పీ4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ కుటుంబరావు, ఎన్నార్టీ ఛైర్మన్ వేమూరి రవి తదితరులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
AP CM
Andhra Pradesh
P4 program
Poverty Eradication
Entrepreneurs
People Partnership
Nara Chandrababu Naidu
Welfare schemes
AP government

More Telugu News