Ghana Helicopter Crash: ఘనాలో కూలిన హెలికాప్టర్.. ఇద్దరు మంత్రుల సహా కీలక అధికారుల దుర్మరణం

Ghana Helicopter Crash Kills Defense Minister and Officials
  • రక్షణ మంత్రి, పర్యావరణ మంత్రి సహా మొత్తం ఎనిమిది మంది మృతి
  • టేకాఫ్ అయిన కాసేపటికే కమ్యూనికేషన్ కట్
  • సాంకేతిక లోపంతోనే కూలినట్లు ప్రకటించిన ప్రభుత్వం
పశ్చిమాఫ్రికా దేశం ఘనాలో నిన్న ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కేంద్ర మంత్రులు, కీలక అధికారులతో బయలుదేరిన సైనిక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో దేశ రక్షణ మంత్రి, పర్యావరణ మంత్రి, కీలక అధికారులు సహా మొత్తం ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. రాజధాని అక్రా నుంచి ఒబువాసి వెళ్లడానికి రక్షణ మంత్రి ఎడ్వర్డ్ ఒమానే బోమా, పర్యావరణ శాఖ మంత్రి ఇబ్రహీం ముర్తాలా ముహమ్మద్ అధికారులతో కలిసి జెడ్-9 అనే సైనిక హెలికాప్టర్ లో బయలుదేరారు. 

కాసేపటికే హెలికాప్టర్ తో కమ్యూనికేషన్ తెగిపోయిందని, ఆ తర్వాత హెలికాప్టర్ కూలిపోయిందనే సమాచారం అందిందని అధికారులు వివరించారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణం చేస్తున్న వారంతా చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది. 

ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మృతదేహాలను వెలికి తీసి ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ కూలడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని, నిపుణుల బృందం దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిందని వివరించారు. సాంకేతిక లోపం కారణంగానే హెలికాప్టర్ కుప్పకూలినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రమాదాన్ని ఘనా ప్రభుత్వం జాతీయ విషాదంగా ప్రకటించింది.

Ghana Helicopter Crash
Edward Omane Boamah
Ghana
helicopter crash
Ibrahim Murtala Muhammed
military helicopter
Accra
Obuasi
Z-9 helicopter
Africa

More Telugu News