PM Modi: రైతుల కోసం ఎంతటి మూల్యమైనా చెల్లిస్తా.. అమెరికాకు ప్రధాని మోదీ గట్టి కౌంటర్

PM Modi Strong Counter to US on Farmers Interests
  • భారత ఎగుమతులపై మరో 25 శాతం సుంకం పెంచిన అమెరికా
  • రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్న ప్రధాని మోదీ
  • దేశ రైతుల కోసం భారత్ సిద్ధంగా ఉందన్న ప్రధాని
 దేశ రైతుల ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని, వారి కోసం ఎంతటి మూల్యం చెల్లించడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసిన మరుసటి రోజే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నందుకు ప్రతీకార చర్యగా భారత ఎగుమతులపై అమెరికా బుధవారం అదనంగా 25 శాతం సుంకాన్ని విధించిన విష‌యం తెలిసిందే. గత నెల 20న విధించిన 25 శాతంతో కలిపి ఇప్పుడు మొత్తం సుంకం 50 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన ఎం.ఎస్. స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడారు. 

"రైతులు, పశుపోషకులు, మత్స్యకారుల ప్రయోజనాలే మాకు అత్యంత ప్రాధాన్యం. ఈ విషయంలో భారత్ ఎన్నటికీ రాజీపడదు. ఇందుకోసం నేను వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలుసు. అయినా నేను సిద్ధంగా ఉన్నాను. దేశ రైతుల కోసం భారత్ సిద్ధంగా ఉంది" అని ఆయన తేల్చిచెప్పారు.

అమెరికా చర్యపై భారత విదేశాంగ శాఖ కూడా తీవ్రంగా స్పందించింది. రష్యా చమురు దిగుమతుల విషయంలో భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం "అన్యాయమైన, అహేతుకమైన చర్య" అని పేర్కొంది. దేశ ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేసింది. 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకునే త‌మ‌ దిగుమతులు ఉంటాయ‌ని తెలిపింది.  
PM Modi
Indian farmers
farmers welfare
US tariffs
India US trade
Russia oil imports
MS Swaminathan
Indian agriculture
trade war
Indian exports

More Telugu News