Donald Trump: ట్రంప్ 50 శాతం పన్నుతో ప్రభావితమయ్యే రంగాలు ఇవే!

Donald Trump Impact on India Exports with 50 Percent Tariff
  • ఆర్గానిక్ రసాయనాలు, కార్పెట్లు, వస్త్రాలు, రొయ్యల ఎగుమతులపై టారిఫ్ ప్రభావం
  • అమెరికా మార్కెట్లో పెరగనున్న భారత వస్తువుల ధరలు
  • భారత ఎగుమతులు 40-50 శాతం తగ్గే అవకాశం
  • గతంలో విధించిన 25 శాతం పన్ను నేటి నుంచి అమల్లోకి
  • అదనపు 25 శాతం సుంకం ఈ నెల 27 నుంచి అమల్లోకి
అమెరికా విధించిన 50 శాతం అదనపు టారిఫ్‌ల కారణంగా భారతదేశంలోని ఎగుమతి రంగాలు తీవ్ర ప్రభావానికి గురవుతాయి. ముఖ్యంగా లెదర్, రసాయనాలు, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాలు, వస్త్రాలు, రొయ్యలు వంటి రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశ్రమ నిపుణులు అంటున్నారు.

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్ భారత వస్తువులపై  25 శాతం అదనపు టారిఫ్ విధించారు. దీంతో ఇప్పటికే ఉన్న సుంకాలతో కలిపి మొత్తం డ్యూటీ 50 శాతానికి చేరుకుంది. రష్యా నుంచి చమురు కొంటున్న చైనా, టర్కీ వంటి ఇతర దేశాలపై మాత్రం అమెరికా ఇలాంటి చర్యలు తీసుకోలేదు. దీని వల్ల అమెరికా మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరుగుతాయి. జీటీఆర్ఐ అనే థింక్ ట్యాంక్ నివేదిక ప్రకారం ఈ టారిఫ్‌ల వల్ల అమెరికాకు భారతదేశం నుంచి ఎగుమతులు 40-50 శాతం తగ్గే అవకాశం ఉంది.

కొత్త టారిఫ్‌ల వల్ల వివిధ రంగాలపై పడే ప్రభావం

  • ఆర్గానిక్ రసాయనాలు: 54 శాతం అదనపు డ్యూటీ
  • కార్పెట్లు: 52.9 శాతం
  • వస్త్రాలు (అల్లిన): 63.9 శాతం
  • వస్త్రాలు (నేసిన): 60.3 శాతం
  • వస్త్రాలు (మేడ్ అప్స్): 59 శాతం
  • వజ్రాలు, బంగారం, ఉత్పత్తులు: 52.1 శాతం
  • యంత్రాలు, యాంత్రిక ఉపకరణాలు: 51.3 శాతం
  • ఫర్నిచర్, పరుపులు: 52.3 శాతం
ఈ అదనపు 25 శాతం సుంకం ఆగస్టు 27 నుంచి అమలులోకి రానుంది. అంతకు ముందు విధించిన 25 శాతం సుంకం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 131.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో 86.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 45.3 బిలియన్ డాలర్ల దిగుమతులు ఉన్నాయి.

పలు రంగాలపై పెను ప్రభావం
50 శాతం టారిఫ్ వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే రంగాలలో వస్త్రాలు/దుస్తులు (10.3 బిలియన్ డాలర్లు), రత్నాలు, ఆభరణాలు (12 బిలియన్ డాలర్లు), రొయ్యలు (2.24 బిలియన్ డాలర్లు), లెదర్ వస్తువులు, పాదరక్షలు (1.18 బిలియన్ డాలర్లు), రసాయనాలు (2.34 బిలియన్ డాలర్లు), ఎలక్ట్రికల్, మెకానికల్ యంత్రాలు (సుమారు 9 బిలియన్ డాలర్లు) ఉన్నాయి.

ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ సమాఖ్య (సీఐటీఐ) ఈ నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా భారతదేశానికి అతిపెద్ద వస్త్ర, దుస్తుల ఎగుమతి మార్కెట్ అని పేర్కొంది. ఈ టారిఫ్‌ల వల్ల ఇతర దేశాలతో పోటీ పడే సామర్థ్యం గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడింది.
Donald Trump
US Tariffs
India Exports
India US Trade
Textile Industry
Gems and Jewellery
Leather Exports
Chemical Exports
Shrimp Exports
Indian Economy

More Telugu News