Swan: ప్రాణం లేని జంట కోసం హంస ఆరాటం.. నెటిజన్లను కదిలిస్తున్న వైరల్ వీడియో

Swan Tries To Revive Lifeless Partner In Viral Video Internet Moved By Heartbreaking Moment
  • ప్రాణం లేని తన జంటను బతికించుకోవాలని ఓ హంస ఆరాటం
  • చెరువులో చలనం లేకుండా పడి ఉన్న నేస్తాన్ని మేల్కొల్పేందుకు తపన
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హృదయ విదారక దృశ్యం
  • జంట పక్షుల మధ్య ఉండే బలమైన ప్రేమకు నిదర్శనమని కామెంట్లు
ప్రేమకు, అనుబంధానికి మనుషులే కాదు, పక్షులు కూడా ప్రాణమిస్తాయని నిరూపించే ఓ హృదయ విదారక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను కదిలిస్తోంది. ప్రాణం లేని తన జంటను ఎలాగైనా బతికించుకోవాలని ఓ హంస పడిన ఆరాటం చూసి నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ విషాదకర దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ అవుతోంది.

ఓ చెరువులో హంసల జంటలో ఒకటి ప్రాణాలు విడిచి నీటిపై చలనం లేకుండా తేలియాడుతోంది. ఇది గమనించిన దాని తోడు హంస, తన జంటను వదిలి వెళ్లలేకపోయింది. తన నేస్తం చనిపోయిందన్న నిజాన్ని అంగీకరించలేక, దాన్ని తిరిగి బతికించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించింది. తన ముక్కుతో నెడుతూ, రెక్కలతో కదుపుతూ మేల్కొల్పేందుకు చేసిన విఫలయత్నం అక్కడున్న వారిని కలచివేసింది. 

ఈ వీడియోను రిటైర్డ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా ఎక్స్‌ (ట్విట్టర్)లో షేర్ చేశారు. "మరణం కూడా విడదీయలేని ప్రేమ. ఈ హంస తన ప్రాణం లేని భాగస్వామిని మేల్కొల్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. హంసలు జీవితాంతం ఒకే జంటతో కలిసి జీవిస్తాయని, వాటి మధ్య విడదీయరాని అనుబంధం ఉంటుందని పక్షి శాస్త్రవేత్తలు చెబుతుంటారు. తమ జంటలో ఒకటి దూరమైతే, రెండోది తీవ్రమైన మానసిక వేదనకు గురవుతుంది. కొన్ని బంధాలు శాశ్వతంగా ఉంటాయి" అని నందా ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో, హంసల మధ్య ఉండే ఈ బలమైన ప్రేమ బంధానికి నిలువుటద్దంలా నిలుస్తోంది. ఇక‌, ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా చలించిపోతున్నారు. "ఇదే కదా నిజమైన ప్రేమంటే", "మనుషుల్లో కూడా ఇంతటి విశ్వాసం కరువైంది" అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన జంతువులకు కూడా మనుషుల్లాగే ప్రేమ, బాధ వంటి భావోద్వేగాలు ఉంటాయనే చర్చకు మరోసారి దారితీసింది. ప్రాణం లేని తన జంటను వదిలి వెళ్లలేక హంస పడుతున్న వేదన, ఎందరి హృదయాలనో ద్రవింపజేస్తోంది.
Swan
Swan love
Viral video
Animal love
Heartbreaking video
Swan death
Sushanta Nanda
Indian Forest Service
Bird love
Swan bond

More Telugu News