RBI: జన్ ధన్ ఖాతాదారులకు ఆర్‌బీఐ కీలక ప్రకటన.. సెప్టెంబర్ 30 డెడ్‌లైన్

RBI Announces Jan Dhan account holders can complete re KYC at camps till Sept 30
  • జన్ ధన్ ఖాతాదారులకు రీ-కేవైసీ తప్పనిసరి అని ఆర్‌బీఐ ఆదేశం
  • దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక శిబిరాల ఏర్పాటు
  • రీ-కేవైసీ పూర్తి చేయడానికి సెప్టెంబర్ 30 ఆఖ‌రి గ‌డువు
  • గడువులోగా పూర్తి చేయకపోతే ఖాతా లావాదేవీలపై ఆంక్షలు
  • జన్ ధన్ యోజన పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న జన్ ధన్ ఖాతాదారులు సెప్టెంబర్ 30 నాటికి తమ రీ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఖాతాదారుల సౌలభ్యం కోసం గ్రామ పంచాయతీ స్థాయిలోనే ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని బ్యాంకులను ఆదేశించింది. జూలై 1న ప్రారంభమైన ఈ కార్యక్రమం సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది.

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకం ప్రారంభమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం తెలిపారు. నిబంధనల ప్రకారం, యాంటీ-మనీ లాండరింగ్ ప్రోటోకాల్స్‌లో భాగంగా ప్రతి పదేళ్లకు ఒకసారి కస్టమర్ వివరాలను ధృవీకరించుకోవడం తప్పనిసరి అని ఆయన వివరించారు. ఈ ఏడాది పెద్ద సంఖ్యలో జన్ ధన్ ఖాతాలకు కేవైసీ అప్‌డేషన్ గడువు ముగియనుందని, గడువులోగా రీ-కేవైసీ పూర్తి చేయని ఖాతాలపై లావాదేవీల పరిమితులు విధించడం లేదా తాత్కాలికంగా సస్పెండ్ చేసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా సుమారు లక్ష గ్రామ పంచాయతీలలో బ్యాంకులు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్యాంపులలో రీ-కేవైసీ సేవలతో పాటు, కొత్త బ్యాంక్ ఖాతాలు తెరవడం, సూక్ష్మ బీమా, పెన్షన్ పథకాలలో చేరడం, వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడం వంటి సేవలను కూడా అందిస్తున్నాయి.

2014లో ప్రారంభమైన జన్ ధన్ యోజన ద్వారా ఇప్పటివరకు 55 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరిచారని, దీనివల్ల కోట్లాది మంది పౌరులు బ్యాంకింగ్ వ్యవస్థలోకి అడుగుపెట్టారని ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకం పదో వార్షికోత్సవం సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిరంతరాయంగా అందాలన్నా, బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి ఆటంకం కలగకూడదన్నా జన్ ధన్ ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సెప్టెంబర్ 30లోగా తమ రీ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
RBI
Reserve Bank of India
Jan Dhan Yojana
PMJDY
KYC
Re-KYC
Sanjay Malhotra
banking
finance
government schemes

More Telugu News