Chiranjeevi: రక్తదానం అనగానే నేను గుర్తుకు రావడం పూర్వజన్మ సుకృతం: చిరంజీవి

Chiranjeevi Says Blood Donation Remembrance is a Blessing
  • రాజకీయాలకు దూరంగా ఉంటున్నానన్న మెగాస్టార్
  • సోషల్‌ మీడియాలో విమర్శలకు తాను చేసిన మంచి పనులే జవాబని వ్యాఖ్య
  • తనలాగా మంచి చేసే తమ్ముళ్లకు సాయంగా ఉంటానని హామీ 
‘‘రక్తదానం అనగానే నేను గుర్తొస్తున్నానంటే అది నా పూర్వజన్మ సుకృతం” అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఫీనిక్స్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన బ్లడ్‌ డొనేషన్‌ డ్రైవ్‌ లో మాట్లాడుతూ చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో తేజ సజ్జాతో కలిసి చిరంజీవి పాల్గొన్నారు. రక్తదానం గొప్పతనాన్ని వివరిస్తూ ఓ జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ చదివాకే బ్లడ్ బ్యాంక్ పెట్టాలనే ఆలోచన వచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఆ జర్నలిస్ట్ కు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. బ్లడ్ డొనేషన్ క్యాంపుకు హాజరైన వారికి, రక్తదానం చేసిన వారికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.

రాజకీయాలకు దూరంగా ఉంటున్నా..
కొంతకాలంగా తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని ఈ సందర్భంగా చిరంజీవి తెలిపారు. అయితే, ఇటీవల ఓ రాజకీయ నాయకుడు తనను అకారణంగా దూషించారని చెప్పారు. ఆ తర్వాత సదరు నాయకుడు ఓ ప్రాంతానికి వెళితే.. అక్కడ ఓ మహిళ ఆయనకు ఎదురు తిరిగిందని చెప్పారు. చిరంజీవిని ఎందుకు దూషించావంటూ ఆయనను నిలదీసింది. ఈ సందర్భంగా సదరు మహిళ భావోద్వేగానికి గురైందని చిరంజీవి తెలిపారు. ఆ వీడియో తనదాకా రావడంతో సదరు మహిళ ఎవరు.. ఎందుకు అంతగా భావోద్వేగానికి గురైందని ఆరా తీసినట్టు పేర్కొన్నారు. ఒకప్పుడు చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌ ద్వారా ఆమె బిడ్డ ప్రాణాలు నిలిచాయని, అందుకే తానంటే ఆమెకు గౌరవమని తెలిసిందని, ఆమె మాటలు విన్నాక తన హృదయం ఉప్పొంగిందని చిరంజీవి తెలిపారు.

సోషల్ మీడియాలో ట్రోల్స్ పై..
సోషల్‌ మీడియాలో విమర్శలపై ఎందుకు స్పందించరంటూ చాలామంది తనను అడుగుతుంటారని చిరంజీవి చెప్పారు. ఆ విమర్శలు, ట్రోల్స్ పై తాను స్పందించాల్సిన అవసరం లేదని, తాను చేసిన మంచి పనులే మాట్లాడతాయని వివరించారు. ‘నేను చేసిన మంచి పనులు, నా అభిమానుల ప్రేమానురాగాలే నాకు రక్షణ కవచాలు’ అని అన్నారు. ‘‘మనల్ని ఎవరైనా మాటలంటే మనం చేసిన మంచే సమాధానం చెబుతుంది. అందుకే నేను ఎప్పుడూ దేనికీ స్పందించను. నాలాగా మంచి చేసే నా తమ్ముళ్లకు సాయంగా ఉంటాను. ఇతర దేశాల్లో ఉన్న అభిమానులు కూడా నా మాటను స్ఫూర్తిగా తీసుకుని రక్తదానం చేస్తున్నారు. వాళ్లందరికీ అభినందనలు’’ అని చిరంజీవి పేర్కొన్నారు.
Chiranjeevi
Blood Donation
Phoenix Foundation
Teja Sajja
Blood Bank
Social Media Trolls
Political Comments
Chiranjeevi Blood Bank
Telugu Cinema
Charity

More Telugu News