Delhi Police: ఢిల్లీలో మహిళా ఎంపీ గొలుసు లాక్కెళ్లిన ఘరానా దొంగ అరెస్ట్

Delhi Police nab man who snatched Congress MPs chain
  • ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ ఆర్. సుధ మెడలో గొలుసు చోరీ
  • మార్నింగ్ వాక్ చేస్తుండగా స్కూటర్‌పై వచ్చి అపహరించిన దుండగుడు
  • నిందితుడు సోహన్ రావత్‌ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
  • దొంగిలించిన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్న అధికారులు
  • నిందితుడిపై గతంలోనే 26 క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తింపు
దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో కాంగ్రెస్ మహిళా ఎంపీ ఆర్. సుధ మెడలోంచి బంగారు గొలుసును లాక్కెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు పాల్పడిన పాత నేరస్థుడు సోహన్ రావత్ (24)ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి చోరీకి గురైన గొలుసును స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఆర్. సుధ సోమవారం ఉదయం 6:15 గంటల సమయంలో తోటి ఎంపీ రాజాతో కలిసి ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో మార్నింగ్ వాక్ చేస్తున్నారు. చెక్ రిపబ్లిక్ రాయబార కార్యాలయం సమీపంలోకి రాగానే, ఫుల్ ఫేస్ హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి స్కూటర్‌పై వేగంగా వచ్చి సుధ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఈ ఘటనలో ఆమె మెడకు గాయాలయ్యాయి. వారు కేకలు వేసినా సమీపంలో ఉన్నవారు ఎవరూ స్పందించలేదు.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వీఐపీ జోన్‌లో పార్లమెంటు సభ్యురాలికే రక్షణ కరవవడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో ఈ కేసును సవాలుగా తీసుకున్న న్యూఢిల్లీ, సౌత్ ఢిల్లీ జిల్లాల పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. వందలాది సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, పాత నేరస్థులపై నిఘా పెట్టి నిందితుడిని గుర్తించారు.

నిందితుడైన సోహన్ రావత్ ఇటీవలే జైలు నుంచి విడుదలైనట్లు, అతనిపై ఇప్పటికే 26 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి 30.9 గ్రాముల బంగారు గొలుసు, నేరానికి ఉపయోగించిన స్కూటర్, హెల్మెట్, దుస్తులతో పాటు చోరీ చేసిన కొన్ని మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఇతర చైన్ స్నాచింగ్ ఘటనల్లో రావత్ ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.
Delhi Police
R Sudha
MP R Sudha
Chain snatching Delhi
Delhi crime
Sohan Rawat
Congress MP
Chanakyapuri
Gold chain theft

More Telugu News