Chandrababu Naidu: చేనేతలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

Chandrababu Naidu AP Govt Announces Good News for Weavers
  • హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీని భరించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం 
  • మగ్గాలకు 200, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ 
  • రూ.5 కోట్లతో నేతన్నలకు పొదుపు నిధి ఏర్పాటు చేయాలన్న సీఎం చంద్రబాబు
  • జాతీయ చేనేత దినోత్సవం నుంచి కొత్త నిర్ణయాల అమలు
చేనేతలకు ఏపీ సర్కార్ శుభవార్త తెలిపింది. చేనేత రంగానికి ఊతమిచ్చేలా, నేతన్నలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. చేనేత శాఖపై రాష్ట్ర సచివాలయంలో నిన్న సీఎం సమీక్ష నిర్వహించారు. చేనేత కార్మికులను ఏ విధంగా ఆదుకోవాలనే అంశంపై చర్చించారు. వ్యవసాయం తర్వాత చేనేతే అత్యంత కీలకమైన రంగమని, దీని మీద ఆధారపడిన వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు.

ఈ మేరకు ఇటీవల జమ్మలమడుగు పర్యటనలో ఓ చేనేత కుటుంబ సభ్యులతో మాట్లాడిన సమయంలో తన దృష్టికి వచ్చిన అంశాలను సమీక్షలో చంద్రబాబు ప్రస్తావించారు. మగ్గాలకు 200 యూనిట్లు, అలాగే పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందివ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు చేపట్టాల్సిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

అలాగే చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయంలో ఈ సమీక్షలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరించాలని నిర్ణయించింది. చేనేత వస్త్రాలపై విధిస్తున్న జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి చెల్లించనుంది. చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేలా ఈ సమీక్షలో సీఎం నిర్ణయం తీసుకున్నారు.

తాజా నిర్ణయాలతో చేనేత రంగం పుంజుకుంటుందని, తక్కువ ధరల్లో చేనేత వస్త్రాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు. దీని వల్ల చేనేత వస్త్రాలకు విక్రయాలు పెరిగి నేతన్నలకు లబ్ది చేకూరుతుందని చెప్పారు. చేనేత కార్మికుల కోసం రూ. 5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్ (పొదుపు నిధి) ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈ నెల ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవం నుంచి ఈ నిర్ణయాలను అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో చేనేత శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
Chandrababu Naidu
AP government
handloom weavers
handloom sector
free electricity
GST
handloom day
thrift fund
textile industry
Andhra Pradesh

More Telugu News