Chiranjeevi: చిరంజీవి నివాసంలో ముగిసిన నిర్మాతల సమావేశం

Chiranjeevi mediates film workers wages dispute
  • టాలీవుడ్ వేతనాల వివాదంపై రంగంలోకి దిగిన చిరంజీవి
  • ప్రముఖ నిర్మాతలతో తన నివాసంలో ప్రత్యేక సమావేశం
  • 30 శాతం వేతనాల పెంపు సాధ్యం కాదన్న నిర్మాతల వాదన
  • షూటింగ్‌లు నిలిచిపోవడంపై మెగాస్టార్ తీవ్ర విచారం
  • కార్మిక సంఘాలతోనూ చర్చించి సమస్యను పరిష్కరిస్తానని హామీ
  • చిరంజీవి మధ్యవర్తిత్వంతో వివాదానికి తెరపడే సూచనలు
టాలీవుడ్‌లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న నిర్మాతలు, సినీ కార్మికుల మధ్య వేతనాల వివాదానికి పరిష్కారం చూపేందుకు మెగాస్టార్ చిరంజీవి నడుం బిగించారు. వేతనాల పెంపు విషయంలో సయోధ్య కుదరకపోవడంతో షూటింగ్‌లు నిలిచిపోయిన నేపథ్యంలో, ఆయన ఈ సమస్యను చక్కదిద్దేందుకు చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా తన నివాసంలో ప్రముఖ నిర్మాతలతో ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.

ఈ భేటీలో నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, దిల్ రాజు, సి. కళ్యాణ్, దామోదర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు డిమాండ్ చేస్తున్న 30 శాతం వేతనాల పెంపు ఎందుకు సాధ్యపడటం లేదనే వివరాలను నిర్మాతలు చిరంజీవికి వివరించారు. ఇప్పటికే తాము 10 నుంచి 15 శాతం పెంపునకు సిద్ధంగా ఉన్నామని, అంతకుమించి పెంచితే చిన్న బడ్జెట్ చిత్రాల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

నిర్మాత సి. కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ...

చిరంజీవి నివాసంలో నిర్మాతల సమావేశం ముగిసిన అనంతరం నిర్మాత సి.కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ వివాదంపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారని, షూటింగ్‌లు బంద్ కావడం బాధాకరమని చెప్పారని తెలిపారు. సినీ కార్మికుల సమస్యలను కూడా విని పరిష్కారానికి కృషి చేస్తానని చిరంజీవి హామీ ఇచ్చారని ఆయన అన్నారు. ఈ సమస్యపై రెండు రోజులు వేచి చూద్దామని, అనంతరం తన అభిప్రాయాన్ని తెలియజేస్తానని చిరంజీవి చెప్పినట్టు సి. కళ్యాణ్ వివరించారు. త్వరలో చిరంజీవి సినీ కార్మిక నాయకులతోనూ భేటీ కానున్నారని, వారి వాదనలు కూడా విన్న తర్వాత ఒక పరిష్కారానికి వస్తారని ఆయన తెలిపారు. చిన్న నిర్మాతల విషయంలోనే ఈ వేతనాల సమస్య వస్తుందని, వారితో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని సి. కళ్యాణ్ పేర్కొన్నారు. 
Chiranjeevi
Telugu film industry
Tollywood
film workers wages
producers meeting
C Kalyan
Ashwini Dutt
Allu Aravind
Dil Raju
film shootings halt

More Telugu News