Chandrababu Naidu: చిన్న సాయమైనా సరే.. కష్టాల్లో ఉన్న కుటుంబానికి అది కొండంత అండ: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Announces P4 Program to Help Poor Families
  • పీ4 కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష 
  • ఆగస్టు 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'పీ4' కార్యక్రమం అమలు
  • 2029 నాటికి జీరో పావర్టీ సాధించడమే ప్రధాన లక్ష్యం
  • 'మార్గదర్శులు' స్వచ్ఛందంగా 'బంగారు కుటుంబాలకు' సాయం
  •  పేద వృద్ధురాలికి అండగా నిలిచిన పారిశుద్ధ్య కార్మికురాలికి సీఎం ప్రశంస
డబ్బుతో పని లేదు, స్పందించే మనసుంటే చాలు... పేదలకు అండగా నిలిచేందుకు అదే పెద్ద అర్హత... చిన్న సాయమైనా సరే, కష్టాల్లో ఉన్న కుటుంబానికి అది కొండంత భరోసా ఇస్తుంది... సరిగ్గా ఇదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లో పేదరికంపై సరికొత్త యుద్ధానికి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మానవతావాదుల భాగస్వామ్యాన్ని జోడిస్తూ 'పీ4' (ప్రజల భాగస్వామ్యంతో పురోగతి, పేదరిక నిర్మూలన) అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. 2029 నాటికి రాష్ట్రాన్ని శూన్య పేదరిక రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా, ఆగస్టు 19వ తేదీ నుంచి ఈ వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు నేడు ప్రకటించారు.

మంగళవారం సచివాలయంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక చేయూత అందుతున్నా, కొన్ని కుటుంబాలకు నైపుణ్యం, మార్గనిర్దేశం, మానసిక స్థైర్యం వంటి అదనపు తోడ్పాటు అవసరమని, ఆ లోటును 'మార్గదర్శకులు' భర్తీ చేస్తారని ఆయన అన్నారు.

హేమలతే నిజమైన మార్గదర్శి!

ఈ కార్యక్రమ స్ఫూర్తికి అసలైన నిర్వచనం చెప్పడానికి ముఖ్యమంత్రి అవనిగడ్డకు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు హేమలత ఉదంతాన్ని ఉటంకించారు. "ఆమె ఆర్ధికంగా నిరుపేద. అయినా తనకంటే కష్టాల్లో ఉన్న ఓ వృద్ధురాలికి అండగా నిలబడింది. రోజూ ఆమె ఇంటికెళ్లి సపర్యలు చేస్తోంది. ఇంతకంటే గొప్ప మానవత్వం ఏముంటుంది? డబ్బున్న వారే దానం చేయాలనేమీ లేదు. ఆదుకోవాలనే సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరూ మార్గదర్శి కావచ్చు. హేమలత లాంటి వారే ఈ కార్యక్రమానికి నిజమైన స్ఫూర్తి ప్రదాతలు," అని సీఎం భావోద్వేగంతో ప్రశంసించారు.

స్వచ్ఛందమే... ఒత్తిడికి తావులేదు!

సమాజంలో స్థిరపడిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పేదరికంలో మగ్గుతున్న 'బంగారు కుటుంబాల'కు చేయూతనివ్వడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని సీఎం స్పష్టం చేశారు. మార్గదర్శుల ఎంపికలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు, బలవంతాలకు తావుండకూడదని అధికారులకు గట్టిగా సూచించారు. "ఇది మానవత్వంతో ముడిపడిన కార్యక్రమం. మనసున్న వారే ముందుకు వస్తారు. గతంలో జన్మభూమి వంటి కార్యక్రమాలను విమర్శించినట్లే, దీన్నీ కొందరు నీరుగార్చాలని చూస్తారు. వాటిని పట్టించుకోవద్దు" అని ఆయన హితవు పలికారు. 

ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పీ4 ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
P4 program
Poverty reduction
Volunteer program
AP government schemes
Financial assistance
Hemalatha
P Keshav
Kutumba Rao

More Telugu News