Donald Trump: 24 గంటల్లో సుంకాలు పెంచుతా... భారత్ కు మరోసారి ట్రంప్ వార్నింగ్

Donald Trump Warns India on Tariffs Increase in 24 Hours
  • భారత్‌పై భారీ సుంకాల పెంపునకు ట్రంప్ సన్నాహాలు 
  • రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై ఆగ్రహం
  • మరిన్ని సుంకాలు ఉంటాయని హెచ్చరిక
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా, భారత్‌పై విధిస్తున్న సుంకాలను వచ్చే 24 గంటల్లో మరింత పెంచబోతున్నట్లు ఆయన మంగళవారం నాడు ప్రకటించారు. ఇప్పటికే ఆగస్టు 7 నుంచి 25 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించినప్పటికీ, ఆ రేటును మరింత పెంచుతానని స్పష్టం చేయడం ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను పెంచేలా ఉంది.

సీఎన్‌బీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. "భారత్‌లో అత్యధిక సుంకాలు ఉన్నాయి. మేము భారత్‌తో చాలా తక్కువ వ్యాపారం చేస్తాం. ముందు 25 శాతానికి అంగీకరించాం, కానీ రాబోయే 24 గంటల్లో దాన్ని గణనీయంగా పెంచాలని నేను భావిస్తున్నాను" అని ట్రంప్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. రష్యా యుద్ధానికి భారత్ తన చమురు కొనుగోళ్ల ద్వారా ఆర్థికంగా సహకరిస్తోందని ఆయన ఆరోపించారు.

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఔషధాలపై 250 శాతం సుంకాలు!

ఈ క్రమంలో ట్రంప్ మరో సంచలన ప్రకటన కూడా చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఔషధాలపై (ఫార్మాస్యూటికల్స్) భారీగా సుంకాలు విధించనున్నట్లు మంగళవారం వెల్లడించారు.

అమెరికాలో ఔషధాల తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సీఎన్‌బీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ సుంకాలు క్రమంగా 250 శాతం వరకు చేరవచ్చని స్పష్టం చేశారు. మొదట తక్కువ శాతంతో సుంకాలు ప్రారంభమవుతాయని, ఏడాది నుంచి 18 నెలల వ్యవధిలో వీటిని 150 శాతం, ఆ తర్వాత 250 శాతానికి పెంచుతామని ట్రంప్ వివరించారు. "మా దేశంలోనే ఫార్మాస్యూటికల్స్ తయారు కావాలని మేము కోరుకుంటున్నాం" అని ఆయన అన్నారు. అంతేకాకుండా, రాబోయే వారం రోజుల్లో విదేశీ సెమీకండక్టర్లు, చిప్‌లపై కూడా సుంకాలు విధిస్తామని తెలిపారు.


Donald Trump
India tariffs
US India trade
Russia oil imports
pharmaceutical imports
foreign semiconductors
US trade policy
trade war
CNBC interview
import duties

More Telugu News