Delhi Biryani Bay Restaurant: బిల్లు ఎగ్గొట్టేందుకు యువకుల ఎత్తు.. సీసీటీవీ ఫుటేజీతో చిత్తు చేసిన ఢిల్లీ హోటల్ యజమాని

CCTV Exposes Youths Attempting to Dodge Bill at Delhi Restaurant
  • నాన్ వెజ్ బిర్యానీ తిన్న యువకుడి నుంచి ఎముక తీసుకున్న మరో యువకుడు
  • వెజ్ బిర్యానీలో ఆ ఎముకను పెట్టి గొడవకు దిగిన వైనం
  • సీసీటీవీ ఫుటేజీలో బయటపడ్డ యువకుల నిర్వాకం
కడుపునిండా తిన్నాక బిల్లు ఎగ్గొట్టేందుకు కొంతమంది యువకులు చేసిన ప్రయత్నం కాస్తా బెడిసికొట్టింది. హోటల్ లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయన్న విషయాన్ని మరచి, తాము చేసిన నిర్వాకం బయటపడడంతో ఆ యువకులు తెల్లమొహం వేశారు. ఢిల్లీలోని కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 
వివరాల్లోకి వెళితే.. గత నెల 31న శాస్త్రి చౌక్ లోని బిర్యానీ బే రెస్టారెంట్ కు పదిమంది యువకులు వెళ్లారు. ఆ బృందంలో కొంతమంది వెజ్ బిర్యానీ, మరికొందరు నాన్ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. సర్వర్ తెచ్చిచ్చిన బిర్యానీని తింటూ ఉన్నట్టుండి అందులో ఓ యువకుడు పెద్దగా కేక వేశాడు. తన ప్లేటులో ఉన్న బిర్యానీలో నుంచి ఓ ఎముకను తీసి చూపుతూ గొడవకు దిగాడు. తాను వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశానని, తన బిర్యానీలో ఎముక వచ్చిందని హోటల్ సిబ్బందిపై మండిపడ్డాడు.

అయితే, వెజ్ బిర్యానీలో ఎముక వచ్చే అవకాశమేలేదని, తమ హోటల్ లో నాన్ వెజ్ విడిగా వండుతామని హోటల్ యజమాని వాదించాడు. అయినా ఆ యువకులు వినకపోవడంతో పోలీసులకు ఫోన్ చేశాడు. వారు వచ్చాక సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా యువకుల నిర్వాకం బయటపడింది. బిల్లు ఎగ్గొట్టేందుకు ఆ యువకులలో ఒకరు వెజ్ బిర్యానీలో ఎముకను పెట్టడం వీడియోలో కనిపించింది. దీంతో పోలీసులు ఆ యువకులను స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే, ఈ వివాదంపై హోటల్ యజమాని ఫిర్యాదు చేయకపోవడంతో యువకులను మందలించి పంపించినట్లు సమాచారం.
Delhi Biryani Bay Restaurant
Biryani Bay Restaurant
Delhi restaurant bill evasion
restaurant bill evasion
food bill scam
CCTV footage
Delhi crime
food fraud
Shastri Chowk
Delhi police

More Telugu News