Guvvala Balaraju: అక్కడ ఏం జరుగుతుందో చూడమని కేసీఆర్ చెబితేనే... నేను అక్కడకు వెళ్లా: గువ్వల బాలరాజు

Guvvala Balaraju Says KCR Told Him to Go to MLA Poaching Site
  • ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాను పాత్రధారిని మాత్రమేనన్న బాలరాజు
  • కాళేశ్వరం నివేదిక వచ్చిన తర్వాత పార్టీకి రాజీనామా చేశానన్న ఆరోపణల్లో నిజం లేదని వ్యాఖ్య
  • బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై తాను ఎక్కడా మాట్లాడలేదన్న బాలరాజు
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన రాజీనామాను ఫ్యాక్స్ ద్వారా పార్టీ అధినేత కేసీఆర్ కు నిన్న పంపించారు. తాజాగా రాజీనామా అంశంపై బాలరాజు ఈరోజు స్పందిస్తూ కీలక విషయాలను వెల్లడించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదిక వచ్చిన తర్వాత తాను రాజీనామా చేశానని కొందరు అంటున్నారని... వాస్తవానికి తాను ఈ నెల 2వ తేదీనే రాజీనామా చేశానని బాలరాజు తెలిపారు. కాళేశ్వరం నివేదిక వచ్చిన తర్వాత తాను రాజీనామా చేశానని కొందరు కామెంట్ చేయడం సరికాదని అన్నారు. రాజీనామా లేఖలో తాను ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదని చెప్పారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జాతీయ రాజకీయాల వైపు వెళ్లాలని తాను నిర్ణయించుకున్నానని తెలిపారు. 

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాను సూత్రధారిని కాదని, కేవలం పాత్రధారిని మాత్రమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఏం జరుగుతుందో చూడమని కేసీఆర్ చెపితేనే... తాను అక్కడకు వెళ్లానని వెల్లడించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశంపై తాను ఎక్కడా మాట్లాడలేదని చెప్పారు. ఏ పార్టీలో చేరాలనేది తాను ఇంకా నిర్ణయించుకోలేదని... తన అనుచరులు, అభిమానుల ఆకాంక్షల మేరకు త్వరలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
Guvvala Balaraju
BRS party
KCR
Kaleshwaram Project
MLA poaching case
Telangana politics
National politics
Achampet

More Telugu News