Margadarsi: మార్గదర్శికి భారీ ఊరట.. క్రిమినల్ కేసును కొట్టివేసిన హైకోర్టు

Margadarsi gets relief as High Court quashes criminal case
  • మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై క్రిమినల్ కేసు కొట్టివేత
  • తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడి
  • డిపాజిటర్ల నుంచి ఒక్క క్లెయిమ్ కూడా రాలేదని వెల్లడి
  • హెచ్‌యూఎఫ్ మాజీ కర్త మరణించడంతో కేసు నిరర్థకమని తీర్పు
  • 17 ఏళ్లుగా నడుస్తున్న కేసుకు పడిన ముగింపు
మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సంస్థపై చాలాకాలంగా నడుస్తున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. తమపై ఉన్న క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం అనుమతించింది.

డిపాజిటర్ల నుంచి ఒక్క అభ్యంతరం కూడా రాకపోవడం, హిందూ అవిభాజ్య కుటుంబ (హెచ్‌యూఎఫ్) మాజీ కర్త మరణించడం వంటి కారణాలతో ఈ కేసును ఇకపై కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. డిపాజిటర్లందరికీ సొమ్ము చెల్లించామని, హెచ్‌యూఎఫ్ కర్త మరణించినందున మిగిలిన సభ్యులను నిందితులుగా చేర్చలేరని మార్గదర్శి సంస్థ ఈ ఏడాది జనవరిలోనే కోర్టుకు వివరించింది.

కేసు నేపథ్యం ఏమిటంటే..
ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారన్న ఆరోపణలతో 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఈ కేసును 2018లోనే హైకోర్టు ఒకసారి కొట్టివేసింది. అయితే, ఈ తీర్పుపై ఫిర్యాదుదారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

దీంతో, 2024 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను తిరిగి హైకోర్టుకే పంపింది. వాస్తవ పెట్టుబడిదారులు, డిపాజిటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, ఈ కేసును కొనసాగించాలా? లేదా? అనేది తేల్చాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, 2024 సెప్టెంబరు 26న హైకోర్టు రిజిస్ట్రీ పత్రికల్లో పబ్లిక్ నోటీసు జారీ చేసింది.

అయితే, డిపాజిట్లన్నీ గతంలోనే చెల్లించినందున ఒక్క డిపాజిటరు కూడా క్లెయిమ్‌తో ముందుకు రాలేదు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ఉన్న క్రిమినల్ కేసును రద్దు చేస్తూ తుది తీర్పు ఇచ్చింది.

Margadarsi
Margadarsi Financiers
Telangana High Court
Criminal proceedings
RBI rules
Deposit collection
Supreme Court
Public notice
Depositors
Financial case

More Telugu News