Virat Kohli: అతని వల్లే ఈ అద్భుత విజయం.. సిరాజ్‌పై కోహ్లీ ఎమోషనల్ పోస్ట్

Virat Kohli Sends Special Message To Mohammed Siraj After Historic Win In 5th England Test
  • ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో భారత్ ఘన విజయం
  • 6 పరుగుల స్వల్ప తేడాతో గెలిచి 2-2తో సిరీస్ సమం
  • మ్యాచ్ హీరోగా నిలిచిన పేసర్ మహమ్మద్ సిరాజ్
  • సిరాజ్‌పై సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లీ ప్రశంసలు
  • జట్టు కోసం సర్వస్వం ఇస్తాడని కొనియాడిన కోహ్లీ
ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో టీమిండియా సంచలన విజయం సాధించిన వేళ, భారత పేసర్ మహమ్మద్ సిరాజ్‌పై మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ సోషల్ మీడియాలో ఒక సందేశాన్ని పోస్ట్ చేశాడు. జట్టు కోసం సిరాజ్ తన సర్వస్వాన్ని పణంగా పెడతాడని, అతని అద్భుత ప్రదర్శన పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని కోహ్లీ పేర్కొన్నాడు.

ఓవల్ మైదానంలో జరిగిన ఐదో టెస్టులో భారత్ కేవలం 6 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఆఖరి రోజు ఇంగ్లండ్ విజయానికి కేవలం 35 పరుగులు అవసరమైన దశలో, చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. ఈ సమయంలో అద్భుతంగా బౌలింగ్ చేసిన మహమ్మద్ సిరాజ్, ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.

నిర్ణయాత్మకమైన చివరి రోజు ఉదయం కేవలం 9 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన సిరాజ్, మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 104 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అంతేకాకుండా, ఈ సిరీస్ మొత్తంలో 23 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి సత్తా చాటాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేని లోటును సిరాజ్ సమర్థవంతంగా భర్తీ చేశాడు.

సిరాజ్ జట్టు కోసం సర్వస్వం పణంగా పెడతాడు: విరాట్
ఈ అపురూప విజయంపై స్పందించిన కోహ్లీ, "టీమిండియా గొప్ప విజయం సాధించింది. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణల పోరాట పటిమ, దృఢ సంకల్పం మనకు ఈ అద్భుత విజయాన్ని అందించాయి. ముఖ్యంగా జట్టు కోసం సర్వస్వాన్ని పణంగా పెట్టే సిరాజ్‌ను ప్రత్యేకంగా అభినందించాలి. అతని ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది" అని తన 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతాలో పేర్కొన్నాడు.  
Virat Kohli
Mohammed Siraj
India vs England
Oval Test
Jasprit Bumrah
Prasidh Krishna
India Cricket Team
Test Series
Cricket victory
Indian Bowler

More Telugu News