US Visa: యూఎస్ వీసా కావాలా? ఇకపై భారీగా బాండ్ చెల్లించాల్సిందే!

Visa Applicants May Need To Post Bond Of Up To 15000 Dollars To Enter US
  • అమెరికా వీసా కోసం కొత్త బాండ్ విధానం
  • కొన్ని దేశాల పౌరులకు తప్పనిసరి
  • 15,000 డాలర్ల వరకు బాండ్ చెల్లింపు
  • ఏడాది పాటు ప్రయోగాత్మకంగా అమలు
  • నిబంధనలు పాటిస్తే బాండ్ మొత్తం వాపసు
అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇది ఒక ముఖ్యమైన వార్త. పర్యాటక (బీ-2), స్వల్పకాలిక వ్యాపార (బీ-1) వీసాలపై అమెరికాకు వచ్చేవారి కోసం ఒక కొత్త నిబంధనను అక్కడి విదేశాంగ శాఖ ప్రకటించింది. దీని ప్రకారం, కొందరు దరఖాస్తుదారులు వీసా పొందాలంటే 5,000 డాలర్ల నుంచి 15,000 డాలర్ల (సుమారు రూ. 4 లక్షల నుంచి రూ. 12.5 లక్షల) వరకు బాండ్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా ఏడాది పాటు అమలు చేయనున్నారు.

అక్రమ వలసలను అరికట్టడంతో పాటు, వీసా గడువు ముగిసినా దేశం విడిచి వెళ్లని వారిని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్ గతంలో జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల ఆధారంగా ఈ పైలట్ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈ నిబంధనలను ఆగస్టు 5న ఫెడరల్ రిజిస్టర్‌లో అధికారికంగా ప్రక‌టించి, 15 రోజుల తర్వాత అమలులోకి తీసుకురానున్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 2026 వరకు కొనసాగుతుంది.

అయితే, ఈ బాండ్ విధానం అన్ని దేశాల వారికి వర్తించదు. ఏయే దేశాల్లో వీసా నిబంధనల ఉల్లంఘనలు ఎక్కువగా ఉన్నాయో గుర్తించి, ఆయా దేశాల జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. దరఖాస్తుదారుడి నేపథ్యాన్ని బట్టి బాండ్ అవసరమా? లేదా? అనేది కాన్సులర్ అధికారులు నిర్ణయిస్తారు. బాండ్ మొత్తాన్ని కూడా వారే నిర్ధారిస్తారు. వీసా మినహాయింపు కార్యక్రమం (వీసా వేవర్ ప్రోగ్రామ్) కింద ప్రయాణించే వారికి ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేశారు.

ఈ బాండ్ విధానం కింద జారీ చేసే వీసాలు సింగిల్ ఎంట్రీకి మాత్రమే అనుమతిస్తాయి. వీసా జారీ అయిన నాటి నుంచి మూడు నెలల వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ వీసాపై అమెరికాలోకి ప్రవేశించిన వారు గరిష్ఠంగా 30 రోజులు మాత్రమే ఉండేందుకు వీలుంటుంది. ప్రయాణికులు వీసా నిబంధనలను పూర్తిగా పాటించి, సరైన సమయంలోగా దేశం విడిచి వెళితే, వారు చెల్లించిన బాండ్ మొత్తాన్ని పూర్తిగా తిరిగి వాపసు చేస్తామని అధికారులు వివరించారు.
US Visa
United States
America travel
B1 B2 visa
visa bond
immigration
Donald Trump
visa waiver program
illegal immigration
US Department of State

More Telugu News