Nara Lokesh: ఆదోని హైస్కూల్లో 'నో అడ్మిషన్' బోర్డు చూసి చాలా ఆనందించాను: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Delighted by No Admissions Board at Adoni High School
  • ఆదోని ప్రభుత్వ స్కూల్లో 'నో అడ్మిషన్ల' బోర్డు ఏర్పాటు
  • ఈ ఏడాది 400 మందికి పైగా కొత్తగా చేరిక
  • మొత్తం 1,725కి చేరిన విద్యార్థుల సంఖ్య
  • స్కూల్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన మంత్రి నారా లోకేశ్
  • ప్రభుత్వ విద్యపై పెరిగిన నమ్మకానికి ఇదే నిదర్శనమన్న మంత్రి
  • ప్రతి స్కూల్లోనూ ఇదే పరిస్థితి రావాలని ఆకాంక్ష
ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒకప్పుడు చిన్నచూపు చూసే పరిస్థితి నుంచి, ఇప్పుడు సీట్లు దొరకని స్థాయికి చేరుతున్నాయి. దీనికి నిదర్శనంగా నిలుస్తోంది ఆదోనిలోని మున్సిపల్ నెహ్రూ మెమోరియల్ హైస్కూల్. ఈ పాఠశాలలో ప్రవేశాలు పూర్తవడంతో ఏకంగా 'నో అడ్మిషన్' అంటూ బోర్డు పెట్టడం పట్ల రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే, ఆదోని నెహ్రూ మెమోరియల్ హైస్కూల్‌లో ఈ విద్యా సంవత్సరంలో రికార్డు స్థాయిలో విద్యార్థులు చేరారు. ఇప్పటికే పాఠశాల సామర్థ్యం మేరకు 1,725 మంది విద్యార్థులు ఉండగా, ఈ ఒక్క ఏడాదే అన్ని తరగతుల్లో కలిపి 400 మందికి పైగా కొత్త విద్యార్థులు చేరారు. దీంతో ఇకపై కొత్త అడ్మిషన్లు తీసుకునే అవకాశం లేకపోవడంతో పాఠశాల యాజమాన్యం 'నో అడ్మిషన్' బోర్డును ప్రదర్శించింది.

ఈ విషయంపై స్పందించిన మంత్రి నారా లోకేశ్, ప్రభుత్వ విద్యపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి ఆదోని పాఠశాలే ఒక చక్కటి ఉదాహరణ అని పేర్కొన్నారు. "నో అడ్మిషన్ బోర్డు చూసి చాలా ఆనందించాను. అడ్మిషన్లు ముగిశాయని చెబుతున్నా, 'మా ఒక్క పిల్లాడినైనా చేర్చుకోండి సార్' అని తల్లిదండ్రులు బతిమాలుతున్నారని ప్రధానోపాధ్యాయుడు ఫయాజుద్దీన్ చెప్పడం ప్రభుత్వ విద్యకు దక్కిన గౌరవం" అని లోకేశ్ తెలిపారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫయాజుద్దీన్‌తో పాటు, ఉపాధ్యాయులు, సిబ్బందికి మంత్రి లోకేశ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలోనూ ఇలాంటి బోర్డులు కనిపించాలని ఆయన ఆకాంక్షించారు. తల్లిదండ్రుల్లో ప్రభుత్వ విద్య పట్ల నమ్మకం కలిగించిన ఉపాధ్యాయులే 'ఏపీ మోడల్ ఎడ్యుకేషన్'ను తీర్చిదిద్దే నిజమైన రథసారథులు అని మంత్రి లోకేశ్ కొనియాడారు.
Nara Lokesh
Adoni
Nehru Memorial High School
AP Model Education
Fayazuddin
Andhra Pradesh education
government schools
school admissions
education system
Telugu news

More Telugu News