Air India: సాంకేతిక లోపాలతో ఎయిరిండియా సతమతం.. తాజాగా మరో విమానం రద్దు

Air India Flight Cancelled Due to Technical Issues
  • సింగపూర్ నుంచి చెన్నై రావలసిన ఎయిరిండియా విమానం రద్దు
  • విమానంలో సాంకేతిక లోపం తలెత్తడమే కారణమని వెల్లడి
  • గత కొద్ది రోజులుగా వరుసగా నిలిచిపోతున్న ఎయిరిండియా సర్వీసులు
  • లండన్-ఢిల్లీ, ఢిల్లీ-లండన్ విమానాల్లోనూ ఇటీవల అంతరాయాలు
  • ఎయిరిండియాలో 51 భద్రతా లోపాలను గుర్తించిన డీజీసీఏ
  • లోపాలు సరిదిద్దుకోవాలని ఎయిరిండియాకు డీజీసీఏ ఆదేశాలు
ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక లోపాలు, సర్వీసుల రద్దు పరంపర కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా వరుస అంతరాయాలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, తాజాగా మరో అంతర్జాతీయ విమాన సర్వీసు నిలిచిపోయింది. ఆదివారం సింగపూర్ నుంచి చెన్నైకి బయలుదేరాల్సిన ఎయిరిండియా విమానాన్ని సాంకేతిక కారణాలతో రద్దు చేశారు.

వివరాల్లోకి వెళితే, ఎయిరిండియాకు చెందిన ఏఐ349 సింగపూర్ నుంచి చెన్నైకి బయలుదేరాల్సి ఉంది. అయితే, టేకాఫ్‌కు ముందు విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించినట్లు ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లోపాన్ని సరిచేయడానికి అదనపు సమయం పట్టే అవకాశం ఉండటంతో విమానాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

బాధిత ప్రయాణికులను వీలైనంత త్వరగా చెన్నైకి పంపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, వారికి హోటల్ వసతి కల్పిస్తున్నామని ఎయిరిండియా తెలిపింది. ప్రయాణికుల అభీష్టం మేరకు టికెట్ డబ్బులు పూర్తిగా వాపసు ఇవ్వడం లేదా మరో విమానంలో ఉచితంగా రీషెడ్యూలింగ్ చేయడం వంటి సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించింది. సింగపూర్‌లోని తమ సిబ్బంది ప్రయాణికులకు అన్ని విధాలా సహాయం అందిస్తున్నారని పేర్కొంది.

గత కొద్ది రోజులుగా ఎయిరిండియా విమానాల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. శుక్రవారం లండన్ నుంచి ఢిల్లీ రావాల్సిన విమానం 11 గంటలకు పైగా ఆలస్యమైంది. అంతకుముందు గురువారం, ఢిల్లీ నుంచి లండన్ వెళుతున్న విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు.

ఇటీవల డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్వహించిన వార్షిక తనిఖీల్లో ఎయిరిండియాలో ఏకంగా 51 భద్రతా లోపాలు బయటపడటం గమనార్హం. ఇందులో పైలట్లకు అసంపూర్తిగా శిక్షణ ఇవ్వడం, గడువు ముగిసిన శిక్షణా మాన్యువల్స్, నాణ్యత లేని సిమ్యులేటర్లు వంటివి ఉన్నాయి. వీటిలో 7 తీవ్రమైన లోపాలను జులై 30 లోపు, మిగిలిన 44 లోపాలను ఆగస్టు 23 లోపు సరిదిద్దుకోవాలని డీజీసీఏ ఎయిరిండియాను ఆదేశించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలోనూ వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తడం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది.
Air India
Air India flights
flight cancellations
technical issues
Singapore to Chennai
DGCA
flight delays
aviation safety
aircraft maintenance
passenger inconvenience

More Telugu News