Jagan Mohan Reddy: ఆ డబ్బు లెక్కలు చూసింది జగన్ అనుచరుడే!: మంత్రి సత్యకుమార్

Minister Alleges Jagan Associate Involved in Liquor Scam
  • జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే జగన్ సానుభూతి డ్రామా అంటూ ఫైర్
  • మద్యం కుంభకోణం డబ్బు బయటపడుతోందని సత్యకుమార్ వ్యాఖ్యలు
  • డబ్బు లెక్కలు చూసిన వ్యక్తి జగన్‌కు అత్యంత సన్నిహితుడు కాదా? అని ప్రశ్న
ఏపీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉందని భావిస్తున్న డబ్బు లెక్కిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పందించారు.  తిరుపతిలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణానికి సంబంధించిన డబ్బు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతోందని, ఆ కుంభకోణం ఆర్థిక లావాదేవీలన్నీ పర్యవేక్షించింది మాజీ ముఖ్యమంత్రి జగన్‌ అనుచరుడేనని ఆరోపణలు చేశారు. "ఆ డబ్బు లెక్కలు చూసిన వ్యక్తి జగన్‌కు అత్యంత సన్నిహితుడు కాదా?" అని సూటిగా ప్రశ్నించారు. 

మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, "గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం మద్యం ద్వారా ప్రజల రక్తాన్ని పీల్చి, వేల కోట్లు కొల్లగొట్టింది. ఆ అవినీతి సొమ్ము ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఒక్కరే. చట్టం తనపని తాను చేసుకుపోతుంది. త్వరలోనే అసలు దోషులెవరో ప్రజల ముందు నిలబెడతాం. కానీ, ఏ పాపం ఎరగనట్టు, తమకు ఏమీ సంబంధం లేనట్టు వైసీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారు" అని ఎద్దేవా చేశారు.

జగన్‌ కు జైలు భయం పట్టుకుందని, అందుకే ప్రజల సానుభూతి పొందేందుకు కొత్త డ్రామాలకు తెరలేపారని మంత్రి ధ్వజమెత్తారు. "తనపై తానే దాడులు చేయించుకోవడం, ఇప్పుడు పోలీసు వ్యవస్థను కించపరిచేలా మాట్లాడటం వంటి చర్యలన్నీ ఆ భయంలోంచి పుట్టినవే. రాబోయే రోజుల్లో తన అవినీతి బాగోతాలు బయటపడి మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందనే ఆందోళన ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది" అని అన్నారు.


Jagan Mohan Reddy
Andhra Pradesh liquor scam
AP liquor scam
Sathya Kumar Yadav
YSRCP corruption
liquor scandal
Andhra Pradesh politics
Tirupati
political criticism
Jagan arrest

More Telugu News