Army Officer: స్పైస్ జెట్ ఉద్యోగులను చితకబాదిన ఆర్మీ అధికారి... వీడియో ఇదిగో!

Army Officer Assaults SpiceJet Staff at Srinagar Airport
  • శ్రీనగర్ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ సిబ్బందిపై ఆర్మీ అధికారి దాడి
  • అదనపు లగేజీ ఫీజు చెల్లించమన్నందుకు మొదలైన వివాదం
  • క్యూ స్టాండ్‌తో దాడి చేయడంతో నలుగురు సిబ్బందికి తీవ్ర గాయాలు
  • ఒకరికి వెన్నెముక ఫ్రాక్చర్, మరొకరికి దవడ విరిగిందని స్పైస్‌జెట్ ఆరోపణ
  • అధికారిపై పోలీసులకు ఫిర్యాదు, నో-ఫ్లై లిస్టులో చేర్చాలని విజ్ఞప్తి
  • ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులకు అందజేసిన సంస్థ
శ్రీనగర్ విమానాశ్రయంలో ఓ ఆర్మీ ఉన్నతాధికారి దురుసుగా ప్రవర్తించాడు. అదనపు లగేజీకి రుసుము చెల్లించాలని కోరినందుకు స్పైస్‌జెట్ విమానయాన సంస్థకు చెందిన నలుగురు సిబ్బందిపై లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న అధికారి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో సిబ్బంది తీవ్రంగా గాయపడినట్టు స్పైస్‌జెట్ వెల్లడించింది.

విమానయాన సంస్థ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన జూలై 26న జరిగింది. సదరు ఆర్మీ అధికారి తనతో పాటు పరిమితికి మించి క్యాబిన్ లగేజీ తీసుకురావడంతో, నిబంధనల ప్రకారం అదనపు రుసుము చెల్లించాలని స్పైస్‌జెట్ సిబ్బంది కోరారు. ఇందుకు ఆయన నిరాకరించడమే కాకుండా భద్రతా నిబంధనలను ఉల్లంఘించి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ అధికారి, సిబ్బందిపై పిడిగుద్దులు కురిపించాడు. కాలితో తన్నడంతో పాటు అక్కడే ఉన్న క్యూ స్టాండ్‌తో విచక్షణారహితంగా దాడి చేశాడని స్పైస్‌జెట్ ఆరోపించింది. ఈ దాడిలో ఓ ఉద్యోగి వెన్నెముకకు తీవ్ర గాయం కాగా, మరొకరి దవడ ఎముక విరిగిందని, మిగతా ఇద్దరికీ కూడా గాయాలయ్యాయని సంస్థ పేర్కొంది.

ఈ ఘటనపై స్పైస్‌జెట్ యాజమాన్యం, ఆర్మీ అధికారి ఇరు వర్గాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులకు అందజేసినట్టు స్పైస్‌జెట్ యాజమాన్యం తెలిపింది. ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించేలా ప్రవర్తించిన ఆ అధికారిని వెంటనే 'నో-ఫ్లై లిస్టు'లో చేర్చాలని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్‌ను (డీజీసీఏ) కోరింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Army Officer
SpiceJet
SpiceJet staff assault
Srinagar Airport
Lieutenant Colonel
extra baggage fee
no fly list
DGCA

More Telugu News