Raj Kishore: టైలర్ కాదు... కిల్లర్! 26 ఏళ్ల తర్వాత అరెస్ట్

Raj Kishore Killer Arrested After 26 Years by Delhi Police
  • బాలుడి హత్య కేసులో జీవిత ఖైదీ అరెస్ట్
  • రెండున్నర దశాబ్దాలుగా పోలీసుల కళ్లుగప్పి పరారీ
  • 1999లో పెరోల్‌పై విడుదలై తప్పించుకున్న నిందితుడు
  • దేశంలోని పలు నగరాల్లో టైలర్ గా మారువేషంలో జీవనం
  • ఘజియాబాద్‌లో పట్టుకున్న ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
పాతికేళ్లకు పైగా పోలీసుల కళ్లుగప్పి, దేశంలోని పలు నగరాల్లో మారువేషంలో జీవిస్తున్న ఓ కిరాతక హంతకుడి వేటకు ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు తెరదించారు. 1993లో ఎనిమిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, అతి దారుణంగా హత్య చేసిన కేసులో జీవిత ఖైదు పడిన దోషిని 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అరెస్ట్ చేశారు. సినిమా కథను తలపించే ఈ ఛేజింగ్‌లో, దర్జీ అవతారంలో ఉన్న నిందితుడిని ఘజియాబాద్‌లో పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్‌కు చెందిన రాజ్ కిశోర్ అలియాస్ బడే లల్లా (55), 1993లో ఢిల్లీలోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీ యజమాని కుమారుడిని అపహరించాడు. బాలుడిని విడిచిపెట్టేందుకు రూ. 30,000 డిమాండ్ చేశాడు. తల్లిదండ్రులు డబ్బు చెల్లించినప్పటికీ, ఆ నరహంతకుడు కనికరించలేదు. బాలుడిని గొంతు నులిమి హత్య చేసి, కళ్యాణ్‌పురి సమీపంలోని మురుగు కాలువలో మృతదేహాన్ని పడేశాడు. ఈ కేసులో పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 364A (విమోచన కోసం కిడ్నాప్) కింద అతడిని అరెస్ట్ చేశారు.

విచారణ అనంతరం 1996లో ఢిల్లీ కోర్టు రాజ్ కిశోర్‌కు జీవిత ఖైదు విధించింది. అయితే, 1999లో ఆరు వారాల పెరోల్‌పై బయటకు వచ్చిన రాజ్ కిషోర్, తిరిగి జైలుకు వెళ్లకుండా పరారయ్యాడు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో తలదాచుకున్నాడు.

ఈ కేసును ఛాలెంజ్‌గా స్వీకరించిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన యాంటీ రాబరీ అండ్ స్నాచింగ్ సెల్ (ఏఆర్ఎస్‌సీ) బృందం, గత రెండు నెలలుగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. హెడ్ కానిస్టేబుల్ మింటూ యాదవ్‌కు అందిన పక్కా సమాచారంతో నిందితుడిపై నిఘా పెట్టింది. అతడికి స్థానికంగా మద్దతు ఉండటంతో పట్టుకోవడం కష్టంగా మారింది. అయినప్పటికీ, సాంకేతిక, మానవ సమాచార వనరులను ఉపయోగించి పోలీసులు పట్టు వదలకుండా ప్రయత్నించి, చివరకు శనివారం ఘజియాబాద్‌లోని ఖోడా కాలనీలో అతడికి బేడీలు వేశారు.

ఈ 26 ఏళ్లలో బీహార్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో దర్జీగా పనిచేస్తూ జీవనం సాగించినట్లు విచారణలో రాజ్ కిశోర్ అంగీకరించాడు. కరోనా సంక్షోభం సమయంలో తన సొంతూరు కాన్పూర్‌ వచ్చి, ప్రస్తుతం అక్కడే టైలరింగ్ దుకాణం నడుపుతున్నట్లు తెలిపాడు. పది మందికి పైగా సభ్యులున్న బృందం రెండు నెలల పాటు శ్రమించి ఈ క్లిష్టమైన కేసును ఛేదించిందని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
Raj Kishore
Raj Kishore arrest
Delhi Police
murder case
kidnapping
crime branch
Kanpur
Ghaziabad
tailor
absconding criminal

More Telugu News