LV Subramanyam: ఏఐతో గంటలో దర్శనం అసాధ్యం.. డబ్బు వృథా చేయొద్దు: టీటీడీకి ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక సూచన

LV Subramanyam advises TTD against AI Darshan plan
  • టీటీడీ ఏఐ వినియోగంపై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు
  • గంటలో శ్రీవారి దర్శనం అసాధ్యమని స్పష్టం
  • ఏఐ టెక్నాలజీ వాడినా ఇది సాధ్యం కాదన్న మాజీ సీఎస్
  • ఏఐ పేరుతో ధనాన్ని వృథా చేయవద్దని సూచన
తిరుమల శ్రీవారి భక్తులకు గంట లేదా రెండు గంటల్లో దర్శనం కల్పించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని వినియోగించాలన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలోచనపై రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యమని, ఈ ఆలోచనను విరమించుకోవాలని ఆయన టీటీడీకి సవినయంగా విజ్ఞప్తి చేశారు. ఏఐ పేరుతో అనవసరంగా ధనాన్ని వృథా చేయడం కంటే, ఆ నిధులను భక్తుల సౌకర్యాల మెరుగుదలకు వినియోగించడం మేలని ఆయన హితవు పలికారు.

ఇటీవల తాను తిరుమలకు వస్తున్నప్పుడు భక్తుల మధ్య జరిగిన సంభాషణలో ఏఐ టెక్నాలజీతో దర్శన సమయాన్ని తగ్గిస్తారన్న ప్రస్తావన వచ్చిందని ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. అయితే, "ఆలయంలో ఉండే సహజమైన పరిమితుల దృష్ట్యా ఎంతటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించినా గంటలో దర్శనం చేయించడం ఆచరణలో సాధ్యం కాదు, అది క్షేమకరం కూడా కాదు" అని ఆయన స్పష్టం చేశారు. భక్తులకు సౌకర్యం కల్పించాలనే సదుద్దేశంతో టీటీడీ పెద్దలు ఈ విధంగా ఆలోచించి ఉండవచ్చని, కానీ వాస్తవ పరిస్థితులను కూడా గమనించాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, "ఆ ఆలోచనను దయచేసి విరమించుకోవాలని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. దాని కోసం అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా, ప్రస్తుతం భక్తులకు కల్పిస్తున్న దర్శన సమయం అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంది. కాబట్టి, ఆ నిధులతో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది" అని వివరించారు. ఇదే సమయంలో, టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ధర్మప్రచార కార్యక్రమాలకు మరింత ఊపునివ్వాలని ఆయన టీటీడీ ఛైర్మన్‌ను కోరారు.
LV Subramanyam
TTD
Tirumala
Artificial Intelligence
AI Technology
Darshan
Pilgrims
Temple
Devotees
Dharma Pracharam

More Telugu News