Revanth Reddy: మోదీని తప్పించాలని గతంలో వాజపేయి, ఇప్పుడు మోహన్ భాగవత్ ప్రయత్నించారు కానీ: రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Revanth Reddy Comments on Modi Removal Attempts by Vajpayee Bhagwat
  • 75 ఏళ్లు దాటిన వ్యక్తులు కుర్చీ వీడాలని భాగవత్ చెప్పారు కానీ మోదీ సిద్ధంగా లేరన్న ముఖ్యమంత్రి
  • మోదీకికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాడుతారని వ్యాఖ్య
  • బీజేపీకి 150 సీట్లు దాటకుండా చూస్తామన్న రేవంత్ రెడ్డి
75 ఏళ్లు దాటిన వ్యక్తులు కుర్చీ వీడాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ సూచించారని, అయితే మోదీ మాత్రం అందుకు సిద్ధంగా లేరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. మోదీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేందుకు గతంలో వాజపేయి, ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు మోహన్ భాగవత్ ప్రయత్నించారని ఆయన అన్నారు. కానీ అది వారి వల్ల కాలేదని, రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ మోదీకి వ్యతిరేకంగా పోరాడుతారని ఆయన తెలిపారు.

ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు దాటకుండా చూస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని ఆయన అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, జేడీఎస్, బీజేడీ, ఆర్జేడీ వంటి ఇతర పార్టీలన్నీ స్వాతంత్ర్యం తర్వాత పుట్టుకొచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ గెలిచినా, ఓడినా ప్రజల్లోనే ఉంటుందని, కానీ ఇతర పార్టీలు గెలిస్తే కుర్చీలో, ఓడిపోతే ఇంట్లో ఉంటాయని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దేశానికి ఏం చేసిందని కొందరు విమర్శిస్తున్నారని, కానీ 140 ఏళ్ల క్రితమే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం మొదలుపెట్టిందని ఆయన అన్నారు. భారత్ నుంచి ఉగ్రవాదులను తరిమికొట్టేందుకు ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని ఆయన పేర్కొన్నారు.

ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణ త్యాగం చేశారని ఆయన అన్నారు. యూపీఏ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాహుల్ గాంధీ తలుచుకుంటే 2009లోనే ప్రధానమంత్రి అయ్యేవారని ఆయన అన్నారు. బీజేపీ, సంఘ్ పరివార్ మోదీని తప్పించేందుకు ప్రయత్నించాయని, కానీ ఆయన రాజీపడలేదని ఆయన వ్యాఖ్యానించారు.
Revanth Reddy
Mohan Bhagwat
Narendra Modi
Telangana CM
Congress Party
Lok Sabha Elections 2024

More Telugu News