Himachal Pradesh: హిమాచల్‌లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్.. వీడియో వైరల్!

Dam Collapses In Himachal Amid Heavy Rainfall Vehicles Swept Away Video Viral
  • హిమాచల్ ప్రదేశ్‌ కులులో క్లౌడ్‌బరస్ట్ బీభత్సం
  • మలానా-I హైడ్రోపవర్ ప్రాజెక్ట్ డ్యామ్ పూర్తిగా ధ్వంసం
  • వరదల్లో చిక్కుకున్న సుమారు 30 మంది.. సొరంగంలో కార్మికులు
  • కొట్టుకుపోయిన వంతెనలు, వాహనాలు, ఇళ్లు
  • రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, పోలీస్ బృందాలు
హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి ప్రకోపించింది. కులు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తడంతో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా సంభవించిన క్లౌడ్‌బరస్ట్ (కుండపోత వర్షం) కారణంగా మలానా నది ఉగ్రరూపం దాల్చింది. ఈ వరద ధాటికి మలానా-I హైడ్రోపవర్ ప్రాజెక్టుకు చెందిన కాఫర్‌డ్యామ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

స్థానిక నివేదికల ప్రకారం, ఈ జలప్రళయంలో మలానా బ్యారేజ్ పూర్తిగా ధ్వంసమైంది. ఓ స్థానికుడు చిత్రీకరించిన వీడియోలో, డ్యామ్ శిథిలావస్థకు చేరిన దృశ్యాలు, లోయ అంతటా చెల్లాచెదురుగా పడి ఉన్న భారీ శిథిలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆకస్మిక వరద ఉధృతికి కార్లు, వంతెనలు, ఇళ్లు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి.

ఈ విపత్తు కారణంగా సుమారు 30 మంది వరదల్లో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వీరిలో నలుగురైదుగురు కార్మికులు హైడ్రోపవర్ ప్రాజెక్టుకు చెందిన ఓ సొరంగంలో చిక్కుకున్నట్లు సమాచారం. మరో 20-25 మంది వరద ప్రభావిత ప్రాంతంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. నిరాశ్రయులైన వీరంతా పాడుబడిన భవనాల్లో తలదాచుకుంటున్నారని, వారికి ఆహారం, మంచి నీరు అందుబాటులో లేవని తెలిసింది.

సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), పోలీసులు, స్థానిక సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. వరదల కారణంగా రహదారులు పూర్తిగా కొట్టుకుపోవడంతో సహాయక సిబ్బంది దట్టమైన అటవీ ప్రాంతాల గుండా నడుచుకుంటూ ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఉన్నతస్థాయి అత్యవసర సమావేశం నిర్వహించారు.

కులులో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం అధికారికంగా నమోదు కాలేదని, అయితే పలువురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. నష్టం పూర్తిస్థాయిలో అంచనా వేయడానికి సమయం పడుతుందని అన్నారు. మరోవైపు, భారీ వర్షాలు కొనసాగుతున్నందున, మరిన్ని కొండచరియలు విరిగిపడే లేదా ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Himachal Pradesh
Viral Video
Himachal Pradesh Floods
Kullu
Cloudburst
Malana River
Hydropower Project
NDRF
Sukhu
Kaffer Dam
Flash Floods

More Telugu News