Ramdas Soren: ఝార్ఖండ్ మంత్రి రాందాస్ సోరెన్‌ తలకు తీవ్ర గాయాలు.. హెలికాప్టర్‌లో ఢిల్లీకి తరలింపు

Ramdas Soren Injured Shifted to Delhi
  • ఈ తెల్లవారుజామున బాత్రూంలో జారిపడిన మంత్రి
  • తలకు, చేతులకు తీవ్ర గాయాలు
  • మెదడులో రక్తం గడ్డకట్టినట్టు గుర్తింపు
  • ఢిల్లీ ఆసుపత్రులకు రిఫర్ చేసిన టాటా మోటార్స్ ఆసుపత్రి వైద్యులు
ఝార్ఖండ్ విద్యా మంత్రి రాందాస్ సోరెన్ ఈ తెల్లవారుజామున తన నివాసంలోని బాత్రూంలో జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆయన పరిస్థితి విషమంగా వున్నట్టు సమాచారం. మెరుగైన చికిత్స కోసం ఆయనను ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీకి తరలిస్తున్నారు.

జంషెడ్‌పూర్‌లోని తన నివాసంలో ఉదయం 4:30 గంటల ప్రాంతంలో రాందాస్ సోరెన్ జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయన తలకు, చేతికి గాయాలయ్యాయి. వెంటనే ఆయనను జంషెడ్‌పూర్‌లోని టాటా మోటార్స్ ఆసుపత్రికి తరలించగా ఆయన మెదడులో రక్తం గడ్డకట్టినట్టు వైద్యులు గుర్తించారు. దీంతో ఢిల్లీలోని మేదాంత లేదా అపోలో ఆసుపత్రికి తరలించాలని సూచించారు.  

రాజకీయ నేపథ్యం
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సీనియర్ నాయకుడైన రాందాస్ సోరెన్ ఘట్‌షిలా నియోజకవర్గం నుంచి మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2024లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో విద్యా, సాక్షరత, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ 2024లో ఆయనకు రెవెన్యూ, రవాణా శాఖలు కూడా అప్పగించారు.

సోరెన్ త్వరగా కోలుకోవాలని కోరుతూ జేఎంఎం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ వంటి రాజకీయ నాయకులు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. రాందాస్ సోరెన్‌ను ఢిల్లీకి తరలించిన తర్వాత అత్యాధునిక వైద్య సౌకర్యాలతో చికిత్స అందించనున్నారు.
Ramdas Soren
Jharkhand
Jharkhand Minister
Hemant Soren
JMM
Accident
Brain Injury
Politics
Ghatshila
Education Minister

More Telugu News