Kalabhavan Navas: మలయాళ నటుడు, మిమిక్రీ కళాకారుడు కళాభవన్ నవాస్ హఠాన్మరణం

Kalabhavan Navas Malayalam Actor and Mimicry Artist Passes Away
  • షూటింగ్ అనంతరం హోటల్ గదికి వెళ్లిన కళాభవన్
  • చెక్ అవుట్ సమయానికి బయటకు రాకపోవడంతో అనుమానం
  • గదిలో స్పృహ కోల్పోయి కనిపించిన కళాభవన్
  • వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం శూన్యం
ప్రముఖ మలయాళ నటుడు, మిమిక్రీ కళాకారుడు కళాభవన్ నవాస్ (51) కొచ్చిలో నిన్న గుండెపోటుతో మరణించారు. ‘ప్రకంబణం’ అనే సినిమా షూటింగ్ నిమిత్తం చోటానికరలోని ఒక హోటల్‌లో బస చేసిన ఆయన, షూటింగ్ పూర్తయిన తర్వాత తన గదిలో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

గుండెపోటు కారణంగానే ఆయన మరణించి ఉండవచ్చవని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరణానికి కచ్చితమైన కారణం తెలుసుకోవడానికి నేడు కలమస్సేరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. నిన్న సాయంత్రం 5.30 గంటలకు షూటింగ్ ముగించుకుని హోటల్‌కి వచ్చిన నవాస్, రెండు రోజుల విరామం ఉన్నందున ఇంటికి వెళ్లాలని అనుకున్నారు. అయితే, చెక్‌అవుట్ సమయానికి ఆయన గది నుంచి బయటకు రాకపోవడంతో, సిబ్బంది తలుపు తెరిచి చూడగా ఆయన స్పృహ కోల్పోయి ఉన్నారు.

కళాభవన్ నవాస్ నేపథ్యం
నవాస్ 1974లో కేరళలోని వడక్కంచెరిలో జన్మించారు. ఆయన తండ్రి అబూబక్కర్ కూడా నటుడే. కళాభవన్ మిమిక్రీ ట్రూప్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన నవాస్ 1995లో 'చైతన్యం' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 'మిమిక్స్ యాక్షన్ 500', 'జూనియర్ మంద్రాకె', 'మట్టుపెట్టి మచ్చన్', 'చందమామ' వంటి చిత్రాల్లో తన హాస్య పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ఇటీవల విడుదలైన 'ఇజ్హా' చిత్రంలో ఆయన తన భార్య రెహానతో కలిసి ప్రధాన పాత్రలో నటించారు. ఆయన సోదరుడు నియాస్ బక్కర్ కూడా నటుడే

నవాస్ మ‌ృతికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మిమిక్రీ ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించి, టీవీ సీరియల్స్‌తో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యారని ఆయన కొనియాడారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం తెలిపారు. నవాస్‌కు భార్య రెహానతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన కుమార్తె మెహ్రీన్ కూడా నటిగా కెరీర్ ప్రారంభించారు. కళాభవన్ నవాస్ తన ప్రతిభ, మిమిక్రీ నైపుణ్యంతో సినీ రంగంలో చెరగని ముద్ర వేశారు. ఆయన ఆకస్మిక మరణం మలయాళ సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది.
Kalabhavan Navas
Malayalam actor
Mimicry artist
Passes away
Kerala cinema
Pinarayi Vijayan
Rehana Navas
Izha movie
Malayalam film industry
Heart attack

More Telugu News