Operation Akhal: కుల్గాంలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా బలగాలు

Terrorist Killed In Encounter In JK Army Says Operation Akhal Underway
  • జమ్మూకాశ్మీర్‌లోని కుల్గాంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్
  • అఖల్ అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం
  • రాత్రంతా భీకరంగా కొనసాగిన ఎదురుకాల్పులు
  • ఆపరేషన్ అఖ‌ల్‌ ఇంకా కొనసాగుతోందని సైన్యం స్పష్టీక‌ర‌ణ‌
  • ఇటీవల శ్రీనగర్, పూంచ్‌లోనూ ఉగ్రవాదుల ఏరివేత
జమ్మూకాశ్మీర్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆపరేషన్ అఖ‌ల్‌ ఇంకా కొనసాగుతున్నట్లు సైన్యం శనివారం ఉదయం అధికారికంగా వెల్లడించింది.

కుల్గాం జిల్లా పరిధిలోని అఖల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టాయి. ఆర్మీ, జమ్మూకాశ్మీర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ), సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ ప్రారంభించాయి. బలగాలు అడవిని జల్లెడ పడుతుండగా, అక్కడ మాటువేసిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు జరపడంతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.

రాత్రంతా ఇరువర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు కొనసాగాయని ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ తెలిపింది. "ఆపరేషన్ అఖల్ కొనసాగుతోంది. బలగాల కాల్పుల్లో ఇప్పటివరకు ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆపరేషన్ ఇంకా ముగియలేదు" అని చినార్ కార్ప్స్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఓ ప్రకటనలో పేర్కొంది. అటవీ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉండటంతో బలగాలు గాలింపును ముమ్మరం చేశాయి. 

కాశ్మీర్ లోయలో ఇటీవలి కాలంలో భద్రతా బలగాలు ఉగ్రవాద ఏరివేత చర్యలను వేగవంతం చేశాయి. కొద్ది రోజుల క్రితమే శ్రీనగర్ సమీపంలో జరిగిన 'ఆపరేషన్ మహాదేవ్'లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. వీరిలో ఏప్రిల్‌లో పెహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడికి సూత్రధారిగా భావిస్తున్న సులేమాన్ అలియాస్ ఆసిఫ్ కూడా ఉన్నాడు. అదేవిధంగా, గురువారం పూంచ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ నుంచి చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. తాజా ఘటనతో లోయలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
Operation Akhal
Kulgaam
Kulgaam encounter
Jammu Kashmir
terrorist killed
Indian Army
SOG
CRPF
Chinarr Corps
Operation Mahadev

More Telugu News