Montana Shooting: అమెరికాలో కాల్పుల కలకలం: బార్‌లో నలుగురిని కాల్చి చంపిన దుండగుడు

Anaconda Shooting Leaves Four Dead Suspect Hunt Underway
  • అమెరికాలోని మోంటానాలో కాల్పుల ఘటన
  • బార్‌లో దుండగుడి కాల్పుల్లో నలుగురి మృతి
  • నిందితుడు ప్రమాదకర ఆయుధంతో ఉన్నాడని హెచ్చరిక
  • భారీగా బలగాల మోహరింపు, నిందితుడి కోసం గాలింపు
  • భయంతో వణికిపోతున్న స్థానిక ప్రజలు
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. మోంటానా రాష్ట్రంలోని అనకొండ నగరంలో ఉన్న ఓ బార్‌లో దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

స్థానిక మీడియా, పోలీసుల కథనం ప్రకారం, శుక్రవారం అనకొండ నగరంలోని ‘ది అవుల్ బార్’లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని మైఖేల్ పాల్ బ్రౌన్‌గా అనకొండ-డీర్ లాడ్జ్ కౌంటీ పోలీసులు గుర్తించారు. నిందితుడి ఫొటోను ఫేస్‌బుక్‌లో విడుదల చేసిన అధికారులు, అతను ప్రమాదకరమైన ఆయుధంతో తిరుగుతున్నాడని హెచ్చరించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానితుడు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు.

ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు అనకొండ పశ్చిమ ప్రాంతంలోని స్టంప్‌టౌన్ రోడ్, అండర్సన్ రాంచ్ లూప్ రోడ్ పరిసరాల్లో భారీగా మోహరించారు. నిందితుడి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని మోంటానా హైవే పెట్రోల్ విభాగం సూచించింది.

కాల్పుల వార్త తెలియగానే అనకొండ పట్టణ వాసులు భయంతో వణికిపోయారు. వ్యాపారులు వెంటనే తమ దుకాణాల తలుపులు మూసివేసి, కస్టమర్లతో పాటు లోపలే ఉండిపోయారు. "మాది మోంటానా, తుపాకులు మాకు కొత్తేమీ కాదు. కానీ, మా పట్టణాన్ని ఇలా లాక్‌డౌన్ చేయడంతో అందరూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు" అని స్థానిక కేఫ్ యజమాని బార్బీ నెల్సన్ తెలిపారు. కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోని ఓ నర్సరీ స్కూల్ యాజమాన్యం కూడా పిల్లలను రోజంతా బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకుంది. నిందితుడు ఇంకా దొరకకపోవడంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.
Montana Shooting
Anaconda Montana
Michael Paul Brown
The Owl Bar shooting
Montana crime
US shootings
Anaconda Deer Lodge County
Stumptown Road
Anderson Ranch Loop Road
Bar shooting

More Telugu News