Donald Trump: రష్యా ఆయిల్‌ దిగుమతిపై కీలక పరిణామం.. భారత్‌ను మెచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్

Donald Trump Praises India on Russia Oil
  • రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు నిలిపివేసిందన్న వార్తలపై ట్రంప్ హర్షం
  • ఇది నిజమైతే మంచి ముందడుగేనని అమెరికా అధ్యక్షుడి ప్రశంస
  • గత వారం నుంచి రష్యా ఆయిల్ కొనని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు
  • ట్రంప్ విధించిన టారిఫ్‌లు, హెచ్చరికల నేపథ్యంలోనే ఈ పరిణామం
  • కొనసాగుతున్న రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ కంపెనీల దిగుమతులు
రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేస్తోందంటూ వస్తున్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ పరిణామం నిజమైతే అదొక మంచి ముందడుగు అని ఆయన ప్రశంసించారు. శనివారం ఆయన మాట్లాడుతూ, "భారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనడం లేదని నేను విన్నాను. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ అదే జరిగితే, అది చాలా మంచి విషయం. ఏం జరుగుతుందో చూద్దాం" అని వ్యాఖ్యానించారు.

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ తర్వాత అంతర్జాతీయంగా ఒత్తిడి ఉన్నప్పటికీ, గత రెండేళ్లుగా భారత్ తక్కువ ధరకే రష్యా నుంచి భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే, ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని భారతీయ ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధించడంతో పాటు, రష్యాతో ఆయుధాలు లేదా చమురు వాణిజ్యం కొనసాగిస్తే మరిన్ని ఆంక్షలు తప్పవని హెచ్చరించారు.

ఈ హెచ్చరికల నేపథ్యంలోనే భారత ప్రభుత్వ రంగ చమురు శుద్ధి సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీ), భారత్ పెట్రోలియం (బీపీ), మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ (ఎంఆర్‌పీఎల్‌) గత వారం నుంచి రష్యా నుంచి ఎలాంటి ముడి చమురును కొనుగోలు చేయలేదని తెలుస్తోంది. ఈ లోటును భర్తీ చేసుకునేందుకు మధ్యప్రాచ్య, పశ్చిమాఫ్రికా దేశాల నుంచి ముడి చ‌మురును దిగుమ‌తి చేసుకుంటున్నాయి.

అయితే, ప్రభుత్వ రంగ సంస్థలు దిగుమతులు ఆపినప్పటికీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ రిఫైనరీలు మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తున్నాయి. రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్‌కు పాక్షిక యాజమాన్యం ఉన్న నయారా ఎనర్జీపై యూరోపియన్ యూనియన్ ఆంక్షల నేపథ్యంలో కొత్తగా ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు, రష్యాతో తమది ఎంతో కాలంగా ఉన్న దృఢమైన భాగస్వామ్యమని, తమ ద్వైపాక్షిక సంబంధాలను మూడో దేశం కోణంలో చూడకూడదని భారత విదేశాంగ శాఖ గతంలోనే స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో భారత్ తన ఇంధన భద్రత, దౌత్య సంబంధాల మధ్య సమతుల్యం పాటించాల్సి వస్తోంది.
Donald Trump
India Russia oil
Russia oil imports
Indian Oil Corporation
Reliance Industries
Nayar Energy
Rosneft
India US relations
India energy security
Ukraine Russia war

More Telugu News