Anil Ambani: అనిల్ అంబానీ పై లుకౌట్ నోటీసులు!

Anil Ambani Faces Lookout Notice in Loan Fraud Case
  • రూ.17వేల కోట్ల లోన్ ఫ్రాడ్ కేసు
  • చర్యలకు ఉపక్రమించిన ఈడీ .. లుకౌట్ నోటీసు జారీ
  • ఆగస్టు 5న విచారణకు హజరుకావాలంటూ గురువారం సమన్లు జారీ చేసిన ఈడీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. రూ.17 వేల కోట్ల లోన్ ఫ్రాడ్ కేసులో భాగంగా ఆయనకు నిన్న ఈడీ లుకౌట్ నోటీసు జారీ చేసింది. ఈ నెల 5న విచారణకు హాజరుకావాలంటూ గురువారం నోటీసులు జారీ చేసిన ఈడీ, నిన్న లుకౌట్ నోటీసులు ఇవ్వడం గమనార్హం.

సాధారణంగా ఈడీ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేస్తుంటారు. లుకౌట్ నోటీసులు జారీ అయిన వ్యక్తులు దేశం విడిచి వెళ్లడానికి అవకాశం ఉండదు. ఒకవేళ వారు దేశం విడిచి పారిపోవాలని ప్రయత్నిస్తే విమానాశ్రయాలు, సీ పోర్టులు, ఇతర మార్గాల వద్ద పాస్‌పోర్టుల తనిఖీల సందర్భంలో గుర్తించి అదుపులోకి తీసుకుంటారు.

లుకౌట్ నోటీసు జారీ కావడంతో అనిల్ అంబానీ దేశం విడిచి వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ అత్యవసరంగా బిజినెస్ పని మీద వేరే దేశానికి వెళ్లాల్సి వస్తే ఈడీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

అనిల్ గ్రూప్ కంపెనీలు కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. రిలయన్స్ ఇన్ ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17 వేల కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రుణం మంజూరు చేయడానికి ముందు బ్యాంక్ ప్రమోటర్లకు పెద్ద మొత్తంలో నిధులు అందినట్లు ఈడీ గుర్తించింది.

ఈ క్రమంలో గత నెల 24వ తేదీన ఈ కేసుతో సంబంధం ఉన్న 50 సంస్థలపై కూడా ఈడీ అధికారులు దాడులు చేశారు. దాదాపు మూడు రోజుల పాటు ఈ దాడులు జరిగాయి. ఈ క్రమంలో తాజాగా అనిల్ అంబానీకి లుకౌట్ నోటీసు జారీ కావడం ఆయనకు బిగ్ షాక్ తగిలినట్లేనని బిజినెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 
Anil Ambani
Reliance Group
Enforcement Directorate
ED
Lookout Notice
Loan Fraud Case
Financial Irregularities
Bank Loans
Reliance Infra
India

More Telugu News