BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. రూ.1కే సరికొత్త 'ఫ్రీడమ్ ప్లాన్'!

BSNL Launches Freedom Plan at Just 1 Rupee
  • రూపాయికే నెల రోజుల అన్‌లిమిటెడ్ కాలింగ్
  • రోజుకు 2జీబీ డేటాతో ఉచిత 4G సిమ్
  • కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్
  • ఆగస్టు 31 వరకు అందుబాటులో ఈ ప్లాన్
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమైంది. వినియోగదారులను ఆకర్షించే లక్ష్యంతో కేవలం ఒక్క రూపాయికే నెల రోజుల పాటు అపరిమిత సేవలను అందించే ఒక బంప‌ర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. "ఫ్రీడమ్ ప్లాన్" పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్ ద్వారా కొత్త కస్టమర్లకు ఉచితంగా 4G సిమ్ కార్డుతో పాటు నెల రోజుల వాలిడిటీతో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 2జీబీ డేటా అందిస్తోంది.

ఈ పరిమిత కాల ఆఫర్ ఈ నెల‌ 1 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్ స్పష్టం చేసింది. ఈ ఆఫర్ పొందాలనుకునే వారు తమ సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఔట్‌లెట్‌కు వెళ్లి కొత్త కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఒక్క రూపాయి చెల్లించి ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు ఉంటుంది. 

అయితే, ఈ ఆఫర్‌లో ఒక ముఖ్యమైన షరతు ఉంది. ఈ ప్లాన్ కేవలం కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ తీసుకునే వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్ సేవలను వినియోగిస్తున్న వారు లేదా ఇతర నెట్‌వర్క్‌ల నుంచి పోర్ట్ అవ్వాలనుకునే వారికి ఈ రూపాయి ఆఫర్ వ‌ర్తించ‌దు. 30 రోజుల ప్రమోషనల్ పీరియడ్ ముగిసిన తర్వాత, సేవలను కొనసాగించాలంటే తప్పనిసరిగా బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న రెగ్యులర్ ప్లాన్‌లలో ఒకదానితో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌లో రూ.147 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది.

ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడానికి, 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా అభివృద్ధి చేసిన స్వదేశీ 4జీ టెక్నాలజీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి బీఎస్‌ఎన్‌ఎల్ ఈ స‌రికొత్త‌ ప్రచారాన్ని చేపట్టింది. ఆసక్తి ఉన్న కస్టమర్లు ఆగస్టు 31లోగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది.
BSNL
BSNL Freedom Plan
BSNL 1 Rupee Plan
Bharat Sanchar Nigam Limited
4G SIM
Unlimited Data
Unlimited Calling
Telecom Offer
India Telecom
Make in India

More Telugu News