Mir Yar Baloch: భారతీయులకు 10 లక్షల ఉద్యోగాలు.. మాతో కలవండి: బలూచిస్థాన్ నేత కీలక ప్రతిపాదన

Mir Yar Baloch Offers 1 Million Jobs to Indians in Balochistan
  • భారత ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలకు బలూచ్ మానవ హక్కుల నేత లేఖ
  • బలూచిస్థాన్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కీలక పిలుపు
  • భారత నిపుణులకు 10 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తామని ప్రతిపాదన
  • 30కి పైగా కీలక రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని వెల్లడి
  • ట్రిలియన్ డాలర్ల విలువైన ఖనిజ సంపదను వెలికితీయడమే లక్ష్యం
  • భారత్‌కు వ్యూహాత్మక ప్రయోజనాలు, ఇంధన భద్రత లభిస్తాయని స్పష్టీకరణ
భారతీయులకు 10 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తామంటూ పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ నుంచి ఓ కీలక ప్రతిపాదన వచ్చింది. బలూచిస్థాన్ ను ఓ దేశంగా పేర్కొంటూ, తమ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుతూ ప్రముఖ బలూచ్ మానవ హక్కుల పరిరక్షకుడు మీర్ యార్ బలూచ్, భారత ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీలకు శుక్రవారం ఓ లేఖ రాశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య దేశంగా, సాంకేతిక శక్తిగా ఉన్న భారత్.. బలూచిస్థాన్ అభివృద్ధికి అత్యంత సహజమైన, నమ్మకమైన భాగస్వామి అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

దక్షిణాసియా, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా కూడలిలో ఉన్న బలూచిస్థాన్.. భౌగోళికంగా, ఆర్థికంగా అత్యంత కీలకమైన ప్రాంతమని మీర్ యార్ తెలిపారు. అరేబియా సముద్రం వెంబడి 1,000 కిలోమీటర్లకు పైగా తీరప్రాంతం, కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాలకు దగ్గరగా ఉండటం వల్ల ఇది మధ్య ఆసియా, ఐరోపా, మధ్యప్రాచ్యానికి సహజమైన ముఖద్వారంగా ఉందని వివరించారు. ఈ ప్రాంతంలో ట్రిలియన్ల డాలర్ల విలువైన అరుదైన ఖనిజాలు, బంగారం, రాగి, చమురు, బొగ్గు, లిథియం, సహజ వాయువు నిక్షేపాలు ఉన్నాయని గుర్తుచేశారు.

అపారమైన సంపద ఉన్నప్పటికీ, దశాబ్దాల దోపిడీ, ఆక్రమణల కారణంగా తమ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛా, సార్వభౌమ బలూచిస్థాన్ గణతంత్రం సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తోందని, వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా ఆర్థిక పరివర్తన తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఒక కొత్త దేశాన్ని నిర్మించే ఈ అద్భుత అవకాశంలో భారత నిపుణులు పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

తమ దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలో భాగంగా 30కి పైగా కీలక రంగాల్లో భారత నిపుణులకు 10 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని మీర్ యార్ బలూచ్ వెల్లడించారు. ఆటోమొబైల్ రంగంలో 40,000, ఏరోస్పేస్‌లో 10,000, రైల్వేలు, రైళ్ల తయారీలో 20,500, పునరుత్పాదక ఇంధన రంగంలో 60,000 ఉద్యోగాలు ఉంటాయని ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా భారత్‌కు కేవలం వాణిజ్య ప్రయోజనాలే కాకుండా వ్యూహాత్మక భద్రత, ఇంధన భద్రతతో పాటు శాంతి కూడా లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Mir Yar Baloch
Balochistan
India jobs
Balochistan development
Indian companies
Pakistan
Human rights
Employment opportunities
Trade
Strategic partnership

More Telugu News