15 వేల జీతంతో రిటైరైన గుమస్తాకు 30 కోట్ల ఆస్తులు
- కర్ణాటకలో మాజీ గుమస్తాకు కళ్లు చెదిరే ఆస్తులు
- 24 ఇళ్లు, 40 ఎకరాల భూమి
- 350 గ్రాముల బంగారం, కిలోల కొద్దీ వెండి
- ఉన్నతాధికారితో కలిసి అవినీతికి పాల్పడినట్లు అనుమానాలు
గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్ లో గుమస్తాగా కలకప్ప అందుకున్న జీతం నెలకు రూ.15 వేలు మాత్రమే. అయితే, ఇంజినీర్‌గా పనిచేసిన జెడ్ఎం చిన్చోల్కర్‌తో కలిసి కలకప్ప అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పలు ప్రాజెక్టులకు నకిలీ పత్రాలు, నకిలీ బిల్లులు సృష్టించి దాదాపు రూ.72 కోట్లకు పైగా నిధులను దుర్వినియోగం చేశారని సమాచారం. ఈ అక్రమాలకు సంబంధించి ఫిర్యాదు అందడంతో లోకాయుక్త అధికారులు స్పందించారు.
కలకప్ప ఇంట్లో సోదాలు నిర్వహించి భారీగా అక్రమాస్తులను గుర్తించారు. కలకప్పకు 24 ఇళ్లు, 40 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఆయన భార్య, సోదరుడి పేర్ల మీద కూడా పలు ఆస్తులు ఉన్నాయని వెల్లడైంది. ఇంట్లో 350 గ్రాముల బంగారం, 1.5 కిలోల వెండి ఆభరణాలతో పాటు రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.